ఏవండీ.. లేవండీ.. నే గెలిచా.. కౌన్సిలర్‌గా భార్య విజయం, కాసేపటికే భర్త మరణం

సాధారణంగా ఎన్నికల్లో గెలిస్తే, గెలిచిన వారింట్లో సంబరాలు అంబరాన్ని తాకుతాయి. కుటుంబసభ్యులు, బంధువులు, అనుచురులతో ఎంతో గ్రాండ్ గా విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ, ఆమె బాధ మాత్రం వర్ణనాతీతం. ఎవరూ తీర్చలేని కష్టం. రెండు రోజుల వ్యవధిలో అటు తల్లిని, ఇటు భర్తను కోల్పోయింది.

ఏవండీ.. లేవండీ.. నే గెలిచా.. కౌన్సిలర్‌గా భార్య విజయం, కాసేపటికే భర్త మరణం

Councilor

amalapuram councilor husband dies: సాధారణంగా ఎన్నికల్లో గెలిస్తే, గెలిచిన వారింట్లో సంబరాలు అంబరాన్ని తాకుతాయి. కుటుంబసభ్యులు, బంధువులు, అనుచురులతో ఎంతో గ్రాండ్ గా విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ, ఆమె బాధ మాత్రం వర్ణనాతీతం. ఎవరూ తీర్చలేని కష్టం. రెండు రోజుల వ్యవధిలో అటు తల్లిని, ఇటు భర్తను కోల్పోయింది. కౌన్సిలర్ గా విజయం సాధించిన కాసేపటికే భర్తను కోల్పోయింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఈ విషాదం చోటు చేసుకుంది.

అమలాపురం మున్సిపాలిటీలో 10వ వార్డు నుంచి వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌గా కొల్లాటి నాగవెంకట దుర్గాబాయి బరిలో నిలిచారు. తన తల్లి, భర్త ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నప్పటికీ.. గుండెల్లో బాధను దిగమింగుకుని బాధ్యతతో ప్రచారంలో పాల్గొన్నారు. కాగా, శనివారం(మార్చి 13,2021) ఆమె తల్లి మరణించారు. దీంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బరువెక్కిన హృదయంతోనే ఆమె అమలాపురం ఎస్‌కేబీఆర్‌ కౌంటింగ్‌ హాల్ కి ఆదివారం(మార్చి 14,2021) ఉదయం వెళ్లారు.

కౌన్సిలర్‌గా గెలిచినట్టు ఫలితం వచ్చింది. దీంతో అంతా ఆమెకు అభినందనలు చెబుతున్నారు. ఇంతలోనే ఆస్పత్రిలో ఉన్న తన భర్త కూడా మరణించినట్లు సమాచారం వచ్చింది. దీంతో ఆమె మరింత కుంగిపోయింది.

రెండు రోజుల వ్యవధిలోనే తల్లీ, భర్త చనిపోవడంతో ఆమె పడుతున్న బాధ వర్ణనాతీతం. వారిద్దరూ ఐసీయూలో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నా ఆ బాధను దిగమింగి మున్సిపల్‌ అభ్యర్థిగా పోటీ చేసిన బాధ్యతతో ప్రచారం చేశారు. చివరికి తల్లీ, భర్త మరణించడంతో కౌన్సిలర్‌గా గెలిచిన ఆనందం పంచుకునే అవకాశం లేకుండా పోయింది.

భర్త మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆమె విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. తన భర్త ఇక లేడనే వార్త ఆమెని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏవండీ.. లేవండీ.. నే గెలిచా.. నన్ను ఆశీర్వదించండి.. మీరిచ్చిన ధైర్యమే నాకు అండండీ.. మీరు లేరనే మాట నన్ను కుంగదీస్తుందండీ… అంటూ భర్త మృతదేహం దగ్గర బోరున విలపించింది. దుర్గాబాయిని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు ఓదార్చారు. ఆమెకు ధైర్యం చెప్పారు.