ap high court : అసైన్డ్ భూముల వ్యవహారం, బాబుకు ఊరట

ap high court : అసైన్డ్ భూముల వ్యవహారం, బాబుకు ఊరట

Cid

amaravathi lands issue : ఏపీ రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసులో ఊరట లభించింది. వారిద్దరిపై సీఐడీ నమోదు చేసిన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. సీఐడీ తమపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్‌ చేస్తూ చంద్రబాబు, నారాయణ ఉన్నత న్యాయస్థానంలో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది.

చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ్‌ లూథ్రా, నారాయణ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి పాలకపక్షం కేసు పెట్టినందున అరెస్టు సహా తదుపరి చర్యలు చేపట్టకుండా నిలువరించాలని కోర్టును కోరారు పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత సీఐడీ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు.

చంద్రబాబు, నారాయణపై నమోదు చేసిన కేసులో ఆధారాలు చూపించాలని సీఐడీని ఆదేశించింది హైకోర్టు. కేసు ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని ప్రశ్నించింది. దీనిపై సీఐడీ తరఫు న్యాయవాది స్పందిస్తూ విచారణ తొలిదశలో వివరాలు చెప్పలేమని.. పూర్తిస్థాయి విచారణకు అనుమతిస్తే అన్ని విషయాలు తెలుస్తాయని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం సీఐడీ విచారణపై స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు.. అమరావతి అసెన్డ్‌ భూముల అవకతవకలపై వేగం పెంచింది సీఐడీ. హైకోర్టు కేవలం చంద్రబాబు, నారాయణలపై విచారణకు మాత్రమే స్టే విధించింది. మిగిలిన వారెవరికి మినహాయింపును ఇవ్వలేదు ఏపీ హైకోర్టు. దీంతో.. రాజధాని అసైన్డ్‌ భూముల అంశంలో సీఐడీ దాఖలు చేసిన కేసులో అధికారుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. అప్పటి గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌, సీఆర్డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ను సీఐడీ అధికారులు పిలిపించారు. తాడేపల్లిలో శ్రీధర్‌ను అధికారులు విచారించారు. అప్పట్లో గుంటూరు, తుళ్లూరు రెవెన్యూ అధికారుల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నారు.

ఇక.. భూముల విషయంలో తమను ఎవరూ బెదిరించలేదంటున్నారు రాజధాని ప్రాంత దళిత రైతులు. ఇవాళ తాడేపల్లి పీఎస్‌లో రైతులు సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు. మందడం సహా పలు గ్రామాల దళిత రైతులు సీఐడీ విచారణకు వచ్చారు. రాజధానికి స్వచ్ఛందంగానే భూములు ఇచ్చామని.. తమ వద్ద భూములు ఎవరూ లాక్కోలేదని… తమను ఎవరూ బెదిరించలేదని విషయాన్ని రైతులు సీఐడీకి చెప్పినట్లు తెలుస్తోంది.

అలాగే.. ప్రభుత్వం నుంచి పరిహారం కూడా అందిందని వివరించారు.
రాజధాని అసైన్డ్‌ భూములపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి గత నెల 24వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు… సీఐడీ కేసు నమోదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చారు. 2021, మార్చి 18వ తేదీ గురువారం సీఐడీ అధికారులు రెండు బృందాలుగా మంత్రి నారాయణ ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు కూడా చేశారు.