USA: అమెరికాలో కాల్పుల కలకలం.. ఆంధ్ర యువకుడి మృతి

USA: ఏలూరు అశోక్ నగర్ కు చెందిన వీరా సాయేశ్ (25) ఎమ్మెస్ కోసం అమెరికాకు వెళ్లి ఒహాయోలోని ఓ గ్యాస్ స్టేషన్ లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేసుకుంటున్నాడు.

USA: అమెరికాలో కాల్పుల కలకలం.. ఆంధ్ర యువకుడి మృతి

USA

USA: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఏలూరు అశోక్ నగర్ కు చెందిన వీరా సాయేశ్ (25) ఎమ్మెస్ కోసం అమెరికాకు వెళ్లి ఒహాయోలోని ఓ గ్యాస్ స్టేషన్ లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. గ్యాస్ స్టేషన్ లో పని చేసుకుంటున్న సాయేశ్ పై దొంగల ముఠా కాల్పులు జరిపింది.

దీంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 2021 నవంబరులో ఎమ్మెస్ చేసేందుకు సాయేశ్ అమెరికాకు వెళ్లాడు. అప్పటి నుంచి క్లీవ్లాండ్ యూనివర్సిటీలో చదువుకుంటూ అక్కడే ఉంటున్నాడు. సాయేశ్ మృతిపై అతడి కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం అందించారు. విద్యార్థి వీరా సాయేశ్ ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో ఎకనామిక్స్ లెక్చరర్ గా పని చేస్తూ రెండేళ్ల క్రితం సాయేశ్ తండ్రి మృతి చెందారు.

తండ్రి కోరిక మేరకు బ్యాంకు లోన్ తీసుకుని ఎమ్మెస్ కోసం సాయేశ్ అమెరికా వెళ్లాడు. రెండు నెలల్లో చదువు పూర్తి కానుండటంతో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం పార్ట్ టైం ఉద్యోగిగా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న కొడుకు మృతి చెందడంతో తల్లి జయశ్రీ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం సహకరించి సాయేశ్ మృతదేహాన్ని త్వరితగతిన తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కాగా, అమెరికాలో కాల్పుల ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇటువంటి ఘటనలను కట్టడి చేయలేకపోతున్నారు. నాలుగు రోజుల క్రితమే అలబామా రాష్ట్రంలో ఓ టీనేజర్ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న సమయంలో దుండగుడు కాల్పులు జరపడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరి కొందరికి తీవ్రగాయాలయ్యాయి. ఓ బాలిక తన 16వ పుట్టినరోజు వేడుక సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. అమెరికాలో పదే పదే కాల్పులు చోటుచేసుకుంటుండడం ప్రవాసుల్లోనూ ఆందోళన కలిగిస్తోంది.

Viral Video: పింఛను కోసం చెప్పులు లేకుండా ఎండలో కొన్ని కిలోమీటర్లు నడిచిన వృద్ధురాలు