YSR Arogyasri లో నూతనశకం : ఆరోగ్య శ్రీలో కరోనాను చేర్చింది మొదటి రాష్ట్రం ఏపీనే – జగన్

  • Published By: madhu ,Published On : July 16, 2020 / 12:35 PM IST
YSR Arogyasri లో నూతనశకం : ఆరోగ్య శ్రీలో కరోనాను చేర్చింది మొదటి రాష్ట్రం ఏపీనే – జగన్

భారత దేశంలో ఎక్కడా లేని విధంగా ఏప్రిల్‌ 6న కరోనాను ఆరోగ్యశ్రీ కింద తీసుకు వచ్చిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని, ఇక్కడ చేసిన తర్వాతే మిగతా రాష్ట్రాలు చేపట్టాయన్నారు సీఎం జగన్. నాన్‌ కోవిడ్‌ ఆస్పత్రుల్లో కూడా దీన్ని అమలు చేయాలని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. 2020, జులై 16వ తేదీ గురువారం ఆరోగ్య విస్తరణ కార్యక్రమం జరిగింది. ఏపీలోని మరో ఆరు జిల్లాలకు విస్తరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ…

1088 అంబులెన్స్ లు : – 
మొదటిసారిగా 104, 108 అంబులెన్స్ (1088)లను ప్రారంభించామన్నారు. ప్రతి కుటుంబం చల్లగా ఉండాలని వైద్యం ఖర్చుకు ఎలాంటి ఇబ్బందులు పడొద్దని ముందుకు వేశామన్నారు. అందులో వైద్యంతో పాటు..వైద్యం అయిపోయిన తర్వాత..పేద వాడు రెస్ట్ తీసుకొనేందుకు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశ్యంతో రోజుకు రూ. 225 చొప్పున (నెలకు రూ. 5 వేలు) ప్రభుత్వం సహాయం ఇస్తుందన్నారు.

కోటి 42 లక్షల ఆరోగ్య శ్రీ కార్డులు : –
దాదాపు కోటి 42 లక్షల ఆరోగ్య శ్రీ (క్యూ ఆర్ కోడ్) కార్డులున్నట్లు, ఇప్పటికే కోటి 38 లక్షల కార్డులను పంపిణీ చేశామన్నారు. మరో 4 లక్షల కార్డుల ప్రింటింగ్ అయిపోయాయని, త్వరలో గ్రామ సెక్రటేరియట్ లో పెట్టి గ్రామ వాలంటీర్ల ద్వారా త్వరలో పంపిణీ చేయాలని సూచించడం జరిగిందన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల  ఆధునీకరణ : – 
నాడు – నేడు కార్యక్రమం కింద జాతీయ ప్రమాణాల స్థాయిలో ఆస్పత్రులను నిర్మిస్తున్నామని, దాదాపు రూ.16 వేల కోట్లు దీని కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రతి నెట్‌ వర్క్‌ ఆస్పత్రికీ గ్రేడింగ్‌ ఇచ్చామని, గ్రేడింగ్‌లో పాస్‌ అయిన ఆస్పత్రినే నెట్‌ వర్క్‌ ఆస్పత్రిగా గుర్తింపు నివ్వడం జరిగిందన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు : – 
ప్రభుత్వ ఆస్పత్రిలో మందులు తీసుకుంటే… వాటి నాణ్యతమీద
సందేహాలు, భయాలు ఉన్న పరిస్థితి ఉంటే..దానిని తొలగించామన్నారు. డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలున్న మందులను మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్నామన్నారు. బయటకూడా దొరకని నాణ్యమైన మందులను అందిస్తున్నామని, 500కుపైగా నాణ్యమైన మందులను ఆస్పత్రులకు అందుబాటులో తీసుకొచ్చామని..ఇవన్నీ జీఎంపీ ప్రమాణాలున్న మందులేనన్నారు.

వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్  : – 
ప్రతి గ్రామంలోకూడా ఎవరికైనా బాగోలేకపోతే అదే గ్రామంలోనే, గ్రామ సచివాలయం పక్కనే ఉండే..వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ కూడా తీసుకు వచ్చే ప్రయత్నాలు చేశామన్నారు. 13 వేల విలేజ్‌ క్లినిక్స్‌ను తీసుకొచ్చి, 54 రకాల మందులు.. అక్కడే అందుబాటులోకి వస్తాయన్నారు. 24 గంటలు ఏఎన్‌ఎం అందుబాటులో ఉండడమే కాకుండా, ఆరోగ్య శ్రీ రిఫరెల్‌ పాయింట్‌గా కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. ఇప్పటికే గ్రామాల్లో పనులు కూడా ప్రారంభం అయ్యాయని, ఏప్రిల్‌నాటికి పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

పిల్లలకు కంటి పరీక్షలు : – 
65 లక్షల మంది పిల్లలను కంటి వెలుగులో కవర్ చేయడం జరిగిందన్నారు. కంటి అద్దాలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేశామని, 1.50 వేల మందికి కళ్ల జోడులు అవసరమైతే…1.29 వేల కళ్ల జోడులు ఇచ్చామన్నారు. కరోనా రావడం వల్ల మిగతా వారికి ఇవ్వలేకపోయామన్నారు.

అన్ని జిల్లాల కలెక్టర్లు దీనిపై ధ్యాసపెట్టి… ఆరోగ్యశ్రీ సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతున్నామని, బాధ్యులైన జేసీలు కూడా ధ్యాసపెట్టాలని కోరుతున్నామన్నారు. 2200 చికిత్సలు ఆరోగ్యశ్రీ కింద అమలయ్యేలా చూడాలని సీఎం జగన్ సూచించారు.