అమరావతి కోసం ఏ త్యాగానికైనా సిద్ధం : జేసీ

అమరావతి కోసం ఏ  త్యాగానికైనా సిద్ధం : జేసీ

JC Divakarreddy Sensational comments : టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి కుటుంబంతో సహా ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్నారు. అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన తాడిపత్రి ఘటనలపై జేసీ స్పందించారు. తన సోదరుడి ఇంటిపై ఎమ్మెల్యే దాడి ఘటనపై రియాక్ట్‌ అయిన జేసీ.. తమ ఇంటిపై దాడి చేస్తే తిరిగి తమ వాళ్లపైనే పోలీసులు కేసులు పెట్టారని ఆరోపించారు.

అట్రాసిటీ కేసును పరిష్కరించే వరకు.. రేపటి నుంచే తాడిపత్రిలో అమరణ దీక్ష చేస్తానని మాజీ ఎంపీ జేసీ ప్రకటించారు. అట్రాసిటీ కేసును రాజకీయంగా వాడుకుంటున్నారని తప్పుబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సీఐని కులం పేరుతో దూషించినట్లు తనపై తప్పుడు కేసు పెట్టారని చెప్పారాయన.

అమరావతి సమస్యపైనా పోరాటానికి సిద్ధమంటున్నారు జేసీ దివాకర్‌రెడ్డి. అమరావతి పరిరక్షణ కమిటీ పిలుపునిస్తే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. చావుకు జానెడు దూరంలో ఉన్నానని.. ఐదు కోట్ల ప్రజల్లో ఒక్కడిగా అమరావతి కోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు జేసీ వెల్లడించారు. చిత్తశుద్ధితో పని చేస్తే అమరావతి సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.

రాష్ట్ర రాజధానిపై ఇంతలా రగడ నడుస్తోంటే…. ప్రధాని మోడీకి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. అమరావతిని మూడు ముక్కలు చేయటం అన్ని పార్టీలూ, ప్రతి ఒక్కరూ అన్యాయమంటున్నారని తెలిపారు. ప్రధాని మోడీకి ఈ విషయం తెలుసో.. తెలీదో అర్థం కావట్లేదన్నారు. అమరావతి రాజధాని సమస్యపై దేశ ప్రధాని మోడీ స్పందించాలని కోరారు.