AP municipal Election 2021 : టీడీపీ ఎందుకు ఓడిపోయింది ? ఓటమికి కారణాలు! నేతల్లో నిరాశ

AP municipal Election 2021 : టీడీపీ ఎందుకు ఓడిపోయింది ? ఓటమికి కారణాలు! నేతల్లో నిరాశ

Municipal Election

municipal Election TDP lost :మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచి.. అధికార పార్టీని నిలదీయాలనుకున్న ప్రతిపక్ష టీడీపీ పార్టీకి… ఊహించని షాక్ ఇచ్చారు ఓటర్లు. సర్కార్ వైఫల్యానే ప్రధాన ప్రచార అస్త్రంగా తీసుకుని జనంలోకి వెళ్లినా.. ఓటర్లు మాత్రం కరుణించలేదు. పౌరుషాలను రగిలించాలని చంద్రబాబు ప్రయత్నించినా.. వర్కవుట్ కాలేదు. ఫలితం మున్సిపల్ స్కోర్‌ బోర్డ్‌లో ఒకే ఒక్క సీట్‌.. మునిసిపల్ ఎన్నికల్లో ప్రధానంగా తమకు అనుకూలిస్తాయని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి భావించిన ప్రధాన పాయింట్లు ఇవే. రాజధాని మార్పు వ్యతిరేక ఉద్యమం కారణంగా అటు విజయవాడ, ఇటు గుంటూరు కార్పోరేషన్లలో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందనే భావనలో ఉన్న టీడీపీ… ఆ ప్రభావం అంతా పుర పోరులో ఓట్ల రూపంలో తమకు అనుకూలిస్తుందని భావించింది. ఈ రెండు కార్పోరేషన్లను సొంతం చేసుకుని… ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పాలనేది టీడీపీ ఆలోచన.

విశాఖ ఉక్కు పరిశ్రమ : –
ఇక విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన తర్వాత… కార్మికులు, ప్రజాసంఘాలు ఆందోళన బాట పట్టారు. నిరవధిక సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. ఆందోళనలు, బంద్ లు, నిరసనలు చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు తెలుపుతోందంటూ వైసీపీపై టీడీపీ ఆరోపణలు చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ… ఓటుతో సమాధానం చెప్పాలంటూ టీడీపీ నేతలు జోరుగా ప్రచారం చేశారు కూడా. కానీ అక్కడ ఫలితం కూడా టీడీపీకి మింగుడు పడటం లేదు. మెజారిటీ స్థానాలను దక్కించుకున్న వైసీపీ… టీడీపీని ప్రతిపక్షానికే పరిమితం చేసింది. విశాఖలో అధికార పార్టీ గెలవడం ఇదే తొలిసారి కూడా.

పది పాయింట్లతో మేనిఫెస్టో : –
ఇక ఎన్నికల సందర్భంగా పది పాయింట్లతో టీడీపీ ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేసింది. ఆస్తి పన్నుతగ్గింపు, నీటి సరఫరా వంటి కీలక హామీలతో జోరుగా ప్రచారం నిర్వహించింది. కానీ… ఆ ప్రభావం కూడా మున్సి పోల్స్ లో కనిపించలేదు. స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు 5 రోజుల పాటు ప్రధాన కార్పోరేషన్ల పరిధిలో జోరుగా ప్రచారం నిర్వహించారు. బంద్ లో పాల్గొన్నారు. ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నో హామీలిచ్చారు. అమరావతి ఉద్యమ ప్రస్తావనతో సెంటిమెంట్ పరంగా దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.

విజయవాడ కార్పొరేషన్ :-
కానీ ఇవేవీ ఎన్నికల్లో పనిచేయలేదు. ఓటర్లను ఆకర్షించలేదు. తప్పనిసరిగా గెలుస్తుందని భావించిన విజయవాడ కార్పోరేషన్ లో సైతం తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఓటర్లు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఓ వైపు వర్గపోరు… మరోవైపు సరైన నాయకత్వం లేకపోవడం వల్ల ఈ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి మద్దతుగా నిలవలేకపోయారు. అదే సమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా అధికార పార్టీకి అనుకూలించింది.
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఆశించిన స్థాయిలో ప్రచారం నిర్వహించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా.. మున్సిపాలిటీల్లో హామీలను నెరవేర్చే పరిస్థితి లేదనీ ఓటర్లు గ్రహించినట్లే కనిపిస్తోంది. అదే సమయంలో తాము ఇచ్చిన హామీలను కూడా ప్రజల్లోకి టీడీపీ నేతలు సరిగ్గా తీసుకెళ్లలేకపోయారని… ఓటమికి అది కూడా ఓ కారణమని భావిస్తున్నారు.

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ :-
రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటడంతో… విజయవాడ, గుంటూరు మున్సిపల్‌ కార్పోరేషన్ల పరిధిలోని ప్రజలు అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా ఉన్నారని వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. ప్రధానంగా రాజధాని అమరావతి ఉన్న గుంటూరు జిల్లాలోని గుంటూరు కార్పోరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో వైసీపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మొత్తం 50 స్ధానాల్లో వైసీపీ ఏపక్షంగా 37 స్ధానాలు కైవసం చేసుకుంది. విపక్ష టీడీపీ కేవలం 6 సీట్లకే పరిమితమైంది.

ఓటమికి కారణాలు :-
ఇక ఎన్నికల సమయంలో స్వయంగా రంగంలోకి దిగిన చంద్రబాబు కొద్ది రోజులుగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే అమరావతి వచ్చిన టీడీపీ అధినేత… నేతలు, కార్యకర్తల మధ్య సరైన సమన్వయం చేయడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇక కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు వైసీపీలో చేరారు. ఆ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ నేతలను నియమించకపోవడం కూడా కార్యకర్తల్లో పరాజయానికి కారణంగా కనిపిస్తోంది. ఇప్పటికే గన్నవరం, చీరాల, రేపల్లె, విశాఖ తూర్పు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు తెలిపారు. కొంతమంది మాజీ మంత్రులు కూడా వైసీపీ, బీజేపీల్లో చేరారు. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికీ కొత్త నేతలను పార్టీ నియమించలేదు. ఈ అంశం కూడా కార్యకర్తల్లో కొంత అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. కీలక నేతల అరెస్టులు, ప్రచారంలో వైఫల్యం, అమలు సాధ్యం కానీ హామీలే టీడీపీ ఓటమికి కారణమని అంతా భావిస్తున్నారు. పార్టీ మారిన నేతల స్థానంలో కొత్త అభ్యర్థులను నియమించక పోవడం కూడా ఆయా ప్రాంతాల్లో పార్టీ ఓటమికి కారణంగా కనిపిస్తోంది.