పంచాయతీ ఎన్నికల టెన్షన్ : టీడీపీ మద్దతుదారుడు ఈరన్న సేఫ్

పంచాయతీ ఎన్నికల టెన్షన్ : టీడీపీ మద్దతుదారుడు ఈరన్న సేఫ్

TDP supporter eranna Safe : అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నాడు టీడీపీ మద్దతుదారుడు ఈరన్న. ముఖానికి మాస్క్‌ ధరించిన ముగ్గురు దుండగులు తనను కిడ్నాప్‌ చేశారని తెలిపాడు. మత్తు మందు ఇచ్చి రాయపురం సమీపంలోని అడవిలోకి తీసుకెళ్ళి చితక బాదారని ఆవేదన వ్యక్తం చేశాడు. మత్తులో నుంచి మేల్కొన్నాక.. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని కత్తులతో బెదిరించారని వాపోయాడు. అయితే కిడ్నాపర్లకు కట్టుకథలు చెప్పి వారి నుంచి తప్పించుకున్నానన్నాడు ఈరన్న.

ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు బొమ్మక్కపల్లికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. కిడ్నాప్‌నకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకొని.. ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రశాంతతకు మారుపేరైన రాయదుర్గం ప్రాంతంలో ఎప్పుడు లేని విష సంస్కృతిని ప్రవేశపెట్టిందని మండిపడ్డారు. దౌర్జన్యాల ద్వారా తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని కిడ్నాపులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాల్వ శ్రీనివాసులు.

బొమ్మక్కపల్లికి చెందిన సర్పంచ్‌ అభ్యర్థి తిమ్మక్క భర్త ఈరన్నను నిన్న దుండగులు కిడ్నాప్‌ చేశారు. అతడు దేవాలయానికి వెళ్తున్న సమయంలో బంధించారు. అయితే వారి చెర నుంచి తప్పించుకొని ఈరోజు ఇంటికి చేరుకున్నాడు ఈరన్న.