ఇంటి వద్దకే ఫించన్లు : గ్రాండ్ సక్సెస్..తొలి రోజే చరిత్ర

  • Published By: madhu ,Published On : February 2, 2020 / 12:53 AM IST
ఇంటి వద్దకే ఫించన్లు : గ్రాండ్ సక్సెస్..తొలి రోజే చరిత్ర

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఇంటి వద్దకే పెన్షన్‌ కార్యక్రమం గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. పింఛన్ల పంపిణీలో గ్రామ వాలంటీర్లు తొలి రోజే చరిత్ర సృష్టించారు. ఒక్కరోజులోనే 76.59 శాతం పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులకు ప్రతినెలా తొలిరోజే ఇంటికే పెన్షన్‌ చేరాలని సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాలతో 2020, జనవరి 01వ తేదీ శనివారం రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఇంటి వద్దకే పెన్షన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నిచోట్లా గ్రామ వాలంటీర్లు లబ్ధిదారులకే ఇళ్లకే వెళ్లి పింఛన్‌ అందజేశారు. జీవిత చరమాంకంలో వున్న వృద్ధులు, మంచం పట్టిన వ్యాధిగ్రస్తులు, కనీసం కదల్లేని స్థితిలో వున్న దివ్యాంగులు… గతంలో పెన్షన్‌ తీసుకోవడానికి స్వయంగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేంది. సీఎం జగన్‌ నిర్ణయంతో ఇప్పుడు వారున్నచోటికే పెన్షన్‌ తీసుకుని రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పెన్షన్ల పంపిణీలో గ్రామ వాలంటీర్లతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులు రికార్డు సృష్టించారు. తొలిరోజే 996.79 కోట్ల రూపాయల పింఛన్లను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పదమూడు జిల్లాల పరిధిలో మొత్తం 41 లక్షల 87 వేల 919 మంది లబ్ధిదారుల దగ్గరకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 54.68 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులుండగా… వీరికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 1320 కోట్ల రూపాయల్ని విడుదల చేసింది.

ఒకేరోజు మొత్తం లబ్ధిదారులకు పెన్షన్ చేరాలనే ప్రయత్నంలో భాగంగా తొలిరోజే 76.59 శాతం పంపిణీ చేశారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల పేరుతో బ్యాంక్‌ ఖాతాలు ప్రారంభించిన ప్రభుత్వం… లబ్ధిదారులకు చెల్లించే పింఛను మొత్తాన్ని ఆయా ఖాతాల్లో జమ చేయడం ద్వారా సకాలంలో పెన్షన్లు పంపిణీ చేసేందుకు వీలు కల్పించింది.
పింఛన్ల చెల్లింపు కోసం ప్రతి వాలంటీరుకు ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్‌ ఇచ్చింది.

Read More : కేంద్ర బడ్జెట్‌..తెలుగు రాష్ట్రాలకు మొండిచెయ్యి..ఎందుకు

స్మార్ట్‌ఫోన్లలో బయోమెట్రిక్‌ ఆధారంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ నిర్వహించారు. ఎక్కడైనా బయోమెట్రిక్‌ సమస్య ఉత్పన్నమైతే… దాన్ని సరిచేసి మరుసటి రోజు పింఛను చెల్లిస్తామని అధికారులు తెలిపారు. పింఛన్ల చెల్లింపు కోసం ప్రభుత్వం ఈ ఏడాదిలో మొత్తం 15 వేల 675 కోట్లు కేటాయించగా… మొదటి రోజే చెల్లింపుల కోసం 1,320 కోట్లు విడుదల చేసింది.
పెన్షన్లను గడప వద్దకే చేర్చాలన్న సంకల్పాన్ని సాకారం చేసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు సీఎం జగన్‌ అభినందనలు తెలిపారు. అవినీతి, వివక్ష లేకుండా 54.6 లక్షల మందికి ఇంటివద్దే పెన్షన్ ఇస్తుంటే… వారి కళ్లలో కనిపించిన సంతోషంతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. దేవుడి దయ, ప్రజల దీవెనతోనే ఇది సాధ్యమైందని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.