Somu Veerraju : బద్వేల్ ఉపఎన్నిక.. బీజేపీ కీలక నిర్ణయం

కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలో పోటీకి సంబంధించి బీజేపీ కీలక ప్రకటన చేసింది. బై పోల్ లో తాము పోటీ చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశ

Somu Veerraju : బద్వేల్ ఉపఎన్నిక.. బీజేపీ కీలక నిర్ణయం

Somu Veerraju

Somu Veerraju : కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలో పోటీకి సంబంధించి బీజేపీ కీలక ప్రకటన చేసింది. బై పోల్ లో తాము పోటీ చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. అంతేకాదు ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని కూడా ఖరారు చేస్తామన్నారు. ఈ దిశగా ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టామన్నారు. జిల్లాలోని పార్టీ నాయకులతో పూర్తి స్థాయిలో సంప్రదింపులను నిర్వహించిన తర్వాత అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

జిల్లా స్థాయి నాయకులతో పాటు, నియోజకవర్గంపై గట్టి పట్టున్న అభ్యర్థిని నిలుపుతామని సోము వీర్రాజు అన్నారు. బద్వేల్ ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో కడప జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలతో సోము వీర్రాజు సమావేశం అయ్యారు. విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బద్వేలు ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటామని తేల్చి చెప్పారు. విజయం సాధించడానికి అన్ని రకాల వ్యూహాలను అనుసరిస్తామని చెప్పారు. అభ్యర్థిని గెలిపించుకునే దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Gangrene Disease : కరోనా బారిన పడినవారికి మరో ముప్పు

”బీజేపీ సిద్ధాంతం ప్రకారం కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా పని చేస్తుంది. బద్వేల్ ఉపఎన్నికలో పోటీ చేస్తామని కేంద్ర కమిటీకి తెలిపాము. బీజేపీ రోడ్ మ్యాప్ తయారు చేసుకుంటోంది. వైసీపీ పై ఉన్న ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుని ముందుకు సాగుతాం. అక్టోబర్ 8 లోపు అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. బీజేపీ జాతీయ పార్టీ కనుక అధిష్టానం నిర్ణయం మేరకు ముందుకు వెళ్తాము. జనసేనతో కలిసి ముందుకు నడవడానికి ప్రయత్నం చేస్తాం. బద్వేలు ఉప ఎన్నికలో మాత్రమే జనసేనతో కాకుండా ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాం” అని సోమువీర్రాజు అన్నారు.

సీఎం జగన్, ఆయన సారథ్యంలోని అధికార పార్టీ బెదిరింపులకు భయపడాల్సిన పని లేదని సోము వీర్రాజు అన్నారు. దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ సుధను వైసీపీ తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడాన్ని సోము వీర్రాజు తప్పు పట్టారు. రాజకీయాల్లో కుటుంబ వారసత్వానికి స్థానం లేదన్నారు. వారసత్వ రాజకీయాలను తాము ప్రోత్సహించట్లేదని స్పష్టం చేశారు. బద్వేలు ఉపఎన్నిక కోసం పార్టీలోని ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త, కష్టపడి పని చేయాలని సూచించారు.

Kangana Ranaut : నాగ చైతన్య – సమంత విడాకులు..అమీర్ ఖాన్ కారణమా ?

రాష్ట్రంలో ఈ ఏడేళ్ల కాలంలో చోటు చేసుకున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని సోము వీర్రాజు అన్నారు. తమ సవాల్‌ను సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు స్వీకరించి చర్చకు సిద్ధం కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు జగన్ ప్రభుత్వం పేర్లు మార్చి తమ స్టిక్కర్లు అతికిస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల మేర నిధులను మంజూరు చేశారని సోము తెలిపారు. ఈ విషయాన్ని తాము గ్రామ గ్రామానికీ తీసుకెళ్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, అది జగన్ సర్కార్ ఘనత ఎంత మాత్రమూ కాదని సోము వీర్రాజు అన్నారు.

ఇది ఇలా ఉంటే, బీజేపీ మిత్రపక్షం జనసేన మాత్రం ఉపఎన్నిక బరి నుంచి తప్పుకుంది. బద్వేల్ ఉప ఎన్నికలో తాము పోటీ చేయడం లేదని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బద్వేలు ఉప ఎన్నికలో జనసేన అభ్యర్థిని బరిలో నిలపడం లేదని తెలిపారు. మృతి చెందిన ఎమ్మెల్యే భార్యకే వైసీపీ టికెట్ ఇచ్చినందున తాము ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని పవన్ వెల్లడించారు. మానవతా దృక్పథంతోనే తాము ఎన్నికలకు దూరంగా ఉన్నామని, బద్వేలు ఉప ఎన్నికను వైసీపీ ఏకగ్రీవం చేసుకోవచ్చన్నారు.