బొబ్బలి వీరులు.. బీజేపీలోకి జంప్ కొడతారా?

  • Published By: sreehari ,Published On : December 18, 2019 / 10:36 AM IST
బొబ్బలి వీరులు.. బీజేపీలోకి జంప్ కొడతారా?

గత ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తొమ్మిదికి తొమ్మిది స్థానాలతో పాటు ఒక పార్లమెంటు స్థానంలో సైతం వైసీపీ విజయదుందుభి మోగించింది. ఎవరి అంచనాలకూ దొరకని విధంగా ఫలితాలు రావడంతో సీనియర్లు కంగుతిన్నారు. ముఖ్యంగా గెలుపుపై ధీమాగా ఉన్న కొందరు సీనియర్లు.. ఎన్నికల ఫలితాలతో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్ పై కొందరు నేతలు బెంగ పెట్టుకున్నారట. భవిష్యత్‌లో టీడీపీలోనే కొనసాగాలా లేక… పార్టీ మారితే బాగుంటుందా అన్న సందిగ్ధంలో ఉన్నారట. ఈ నేపథ్యంలోనే కొందరు నేతలు పార్టీ మారతారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.

ఆ ఇద్దరూ బీజేపీలోకి వెళ్తారా? :
పార్వతీపురం డివిజన్‌కు చెందిన పలువురు నేతలు బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు కొన్ని రోజుల క్రితం వరకు హల్‌చల్ చేశాయి. ప్రధానంగా బొబ్బిలి రాజ వంశీయులు, మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావుతో పాటు ఆయన సోదరుడు బేబీ నాయన, పార్వతీపురానికి చెందిన ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్‌ వంటి పెద్ద నేతలు బీజేపీ వైపు చూస్తున్నట్లు జనాల్లో బాగా చర్చ సాగింది. వీరితో పాటు జిల్లాలోని కాపు నేతలు సైతం బీజేపీలోకి వెళ్లే చాన్స్ ఉందనే ప్రచారం సాగింది. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, డాక్టర్ కె.ఎ.నాయుడు కూడా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో ఉన్న అనుబంధంతో బీజేపీలోకి జంప్ చేస్తారన్న వార్తలొచ్చాయి. అయితే, గంటా పార్టీ మార్పుపై వెనక్కి తగ్గడంతో ఈ నేతలు కూడా ప్రస్తుతానికి సైలెంట్ అయిపోయారని అంటున్నారు.

గత ఎన్నికల్లో బొబ్బిలి రాజులకు ఊహించని దెబ్బ తగిలింది. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో గెలుపుపై ధీమాగా ఉన్న ఈ బొబ్బిలి వీరులు ఫ్యాన్ గాలిలో కొట్టుకుపోయారు. ఈ పరిణామంతో బొబ్బిలి రాజులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. సుజయ కృష్ణ రంగారావు అయితే ఏకంగా నియోజకవర్గంలో కనిపించడం మానేశారు. ఎన్నికల తర్వాత ఏదో తూతూ మంత్రంగా రెండు మూడు సార్లు మాత్రమే బొబ్బిలిలో కనిపించారు. మరోపక్క పార్టీ కార్యకలాపాల్లో సైతం ఆయనకు చురుగ్గా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సోదరులిద్దరూ బీజేపీలోకి వెళ్లేందుకు పావులు కదుపుతున్నట్లు గుసగుసలు వినిపించాయి.

బొబ్బలి రాజులపై బీజేపీ కన్ను :
ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీని బలపరచేందుకు బీజేపీ అధినాయకత్వం తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. స్థానికంగా బలమైన నేతల కోసం అన్వేషిస్తోందంటున్నారు. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న బొబ్బిలి రాజులపై బీజేపీ నేతల కన్ను పడిందంట. ఈలోపు ఏమైందో గానీ కొన్ని రోజులుగా బొబ్బిలి రాజులు సైలెంట్ అయిపోయారు. బీజేపీలోకి వెళ్లేందుకు కూడా వారు సుముఖంగా లేరన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీకి ఊహించినంతగా సానుకూల పరిస్థితిలు కనిపించడం లేదంట. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగితే వచ్చే ఎన్నికల్లో మరోసారి టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్స్ ఉందంటూ చర్చ జరుగుతోంది. అందుకే సైలెంట్‌గా అయినా టీడీపీలోనే ఉండడం బెటర్‌ అని బొబ్బిలి రాజులు అనుకుంటున్నారట.

అందుకే.. వెనక్కి తగ్గారా? :
ఇక ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్‌ కూడా తొలుత బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. కాకపోతే ఆయన కూడా ఇప్పుడు టీడీపీలో కొనసాగడానికే ఇష్టపడుతున్నారట. టీడీపీలో ఉండగా ఆయన ఎన్నో పదవులను చేపట్టారు. ముఖ్యంగా టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా, రెండు దఫాలు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం ఎమ్మెల్సీ పదవి వరించింది. ఈ పరిస్థితిల్లో పార్టీ మారితే తన భవిష్యత్ ఎలా ఉంటుందోనన్న సందేహంతోనే పార్టీ మార్పుపై వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.

వీరితో పాటు మాజీ ఎమ్మెల్యేలు మీసాల గీత, కె.ఎ.నాయుడు కూడా తొలుత పార్టీ మారుతారన్న వార్తలు వచ్చాయి. కానీ, ప్రస్తుత పరిస్థితిల్లో టీడీపీలోనే కొనసాగితే మంచిదన్న అభిప్రాయంలో వీరున్నారని జనాలు అనుకుంటున్నారు. మొత్తం మీద పుంజుకుంటుందో లేదో తెలియని గానీ, బీజేపీ కంటే ఎప్పటి నుంచో ఉన్న టీడీపీయే ముద్దని వీరంతా అనుకుంటున్నారని ఊరిజనమంతా అనుకుంటున్నారు.