ఇలాంటి మండలి అవసరమా? మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

  • Published By: veegamteam ,Published On : January 26, 2020 / 07:55 AM IST
ఇలాంటి మండలి అవసరమా? మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ శాసనమండలిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ శాసనమండలిని రద్దు చేస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్న సమయంలో.. మండలి రద్దు గురించి మంత్రి బొత్స హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం(జనవరి 26,2020) మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన బొత్స.. మండలి అవసరమా అనే చర్చ రాష్ట్రమంతా జరుగుతోందన్నారు. శాసనమండలి నిబంధనలకు తూట్లు పొడిచిందని బొత్స చెప్పారు. కొందరు రాజకీయ లబ్ది కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం 5 కోట్ల మంది లబ్ది కోసం పని చేస్తోందన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలను ప్రలోభ పెడుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని బొత్స మండిపడ్డారు.

టీడీపీ కార్యకర్తలా మండలి చైర్మన్..?
మండలిని రద్దు చేయాలన్న ఆలోచనకు వక్ర భాష్యం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలి చైర్మన్ షరీఫ్ టీడీపీ కార్యకర్తగా వ్యవహరించారని బొత్స ఆరోపించారు. సూచనలు చేయాల్సిన మండలి.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం బాధాకరం అన్నారు. శాసన మండలిలో ప్రజాతీర్పుని అపహాస్యం చేశారని బొత్స వాపోయారు. రాజ్యాంగానికి మండలిలో తూట్లు పొడవడంపై సీఎం జగన్ ఆవేదన చెందారని బొత్స చెప్పారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఎలా అడ్డంగా దొరికిపోయారో.. టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేశారో ప్రజలు చూశారని బొత్స అన్నారు.

మూడు రాజధానుల బిల్లుని శాసనసభలో ఆమోదింపజేసుకున్న జగన్ ప్రభుత్వానికి మండలిలో షాక్ తగిలింది. కీలక బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని మండలి చైర్మన్ నిర్ణయించారు. దీంతో మూడు రాజధానులకు బ్రేక్ పడింది. సెలెక్ట్ కమిటీ ప్రక్రియకు కనీసం 3 నెలలు సమయం పడుతుంది. అప్పటివరకు వికేంద్రీకరణ బిల్లు చట్టంగా మారదు. మండలిలో నాటకీయ పరిణామాల నడుమ.. బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ షరీఫ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. చైర్మన్ షరీఫ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, టీడీపీకి అనుకూలంగా పని చేశారని ఆరోపణలు చేశారు.
 
మండే మండలి క్లోజ్..?
బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపుతూ మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని సీరియస్ గా తీసుకున్న సీఎం జగన్.. ఏకంగా మండలిని రద్దు చేసే ఆలోచనతో ఉన్నారని తెలుస్తోంది. పేదరికంలో ఉన్న రాష్ట్రానికి మండలి అవసరమా? అని శాసనసభలో సీఎం జగన్ అనడం సంచలనమైంది. మండలిని రద్దు చేయనున్నారనే సంకేతాలు ఇచ్చింది. సోమవారం(జనవరి 27,2020) ఉదయం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. అందులో మండలి రద్దుపై సీఎం జగన్ ఓ నిర్ణయం తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి.

మండలి రద్దుపై బొత్స కామెంట్స్:
* మండలిలో నిబంధనలకు తూట్లు పొడిచారు
* మండలిలో ప్రజాతీర్పుని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు
* మండలి చైర్మన్ షరీఫ్ టీడీపీ కార్యకర్తగా వ్యవహరించారు
* ఇలాంటి మండలి అవసరమా? అనే చర్చ రాష్ట్రమంతా జరుగుతోంది
* టీడీపీ ఎమ్మెల్సీలను ప్రలోభ పెడుతున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు

* గతంలో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఎలా దొరికిపోయారో ప్రజలు చూశారు
* గతంలో మా ఎమ్మెల్యేలను ఎలా కొన్నారో చూశారు
* అందుకే చంద్రబాబుకి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు
* చేతిలో మీడియా ఉందని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఎలా?
* వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ యనమల

* టీడీపీ ఎమ్మెల్సీలకు రూ.5కోట్లు, రూ.10కోట్లు ఎందుకిస్తాం.?
* వాళ్లేమైనా ప్రజా ఆమోదం ఉన్న నేతలా..?
* మండలిలో రాజ్యాంగానికి తూట్లు పొడవడంపై సీఎం జగన్ ఆవేదన చెందారు