నంద్యాల సలాం అత్త కుటుంబానికి సీఎం జగన్ పరామర్శ, అండగా ఉంటానని హామీ

  • Published By: naveen ,Published On : November 20, 2020 / 04:48 PM IST
నంద్యాల సలాం అత్త కుటుంబానికి సీఎం జగన్ పరామర్శ, అండగా ఉంటానని హామీ

cm jagan adbul salam: కర్నూలు జిల్లా నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ అబ్దుల్‌ సలాం అత్త మహబున్నీసా కుటుంబాన్ని పరామర్శించారు సీఎం జగన్. ఆమె కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు జగన్‌. సలాం ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మహబున్నీసా కూతురు సాజీదాకు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశాలిచ్చారు. అలాగే సీఎం ఆదేశాలతో మహబున్నీసా అల్లుడిని అనంతపురం నుంచి నంద్యాలకు బదిలీ చేశారు అధికారులు.




ఏపీఎస్పీ గెస్ట్‌హౌస్‌ దగ్గర సలాం అత్త కుటుంబాన్ని సీఎం జగన్‌ పరామర్శించారు. సలాం అత్త మాబున్నీసా, శంషావలీ, షాజిదాలతో మాట్లాడారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు అనంతపురం డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి.. నంద్యాల వైద్య ఆరోగ్యశాఖకు మహబున్నీసా అల్లుడు శంషావలిని బదిలీ చేస్తూ డిప్యూటేషన్ ఆర్డర్స్ విడుదలయ్యాయి. ఈ సందర్భంగా మాబున్నీసా ముఖ్యమంత్రి జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబాన్ని ఆదుకున్నందుకు సీఎంకు రుణపడి ఉంటామన్నారు.
https://10tv.in/vijayasai-reddy-fires-on-chandrababu/
నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనపై స్పందించిన సీఎం జగన్‌.. తక్షణమే విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అదే విధంగా బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు సలాం అత్త మాబున్నీసాకు ప్రభుత్వం ఇప్పటికే రూ. 25 లక్షల ఆర్థికసాయం అందించింది. ఇక ఈ కేసుకు సంబంధించి ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపణలున్న సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌లను ఇప్పటికే సస్పెండ్‌ చేస్తూ వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేశారు.




ఏడాది క్రితం బంగారం దుకాణంలో చోరీ కేసులో ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాంను నిందితుడిగా చేర్చారు. తాను చేయని దొంగతనం కేసులో తనపై ఒత్తిడి పెంచి వేధింపులకు గురిచేస్తున్నారని.. తీవ్ర మనస్తాపం చెందిన అబ్దుల్ సలాం సెల్ఫీ వీడియో తీసుకుని నవంబర్ 3న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నలుగురు కుటుంబసభ్యులు రైలు కింద పడి చనిపోయారు. ఈ ఘటన ఏపీలో సంచలనం రేపింది. ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వెంటనే బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే సీఐతో పాటు హెడికానిస్టేబుల్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. అబ్దుల్ సలాం ఆటోలో నగదు పోయినట్లు ఫిర్యాదు చేసిన భాస్కర్ రెడ్డిని కూడా పోలీసులు విచారించారు. నవంబర్ 3న కౌలూరు దగ్గర అబ్దుల్ సలాం తన కుటుంబసభ్యులతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, పోలీసులు తప్పుడు కేసు పెట్టారని, తనను వేధిస్తున్నారని, వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అబ్దుల్ సలామ్ సెల్ఫీ వీడియో వెలుగులోకి రావడంతో ఈ కేసు మలుపు తిరిగింది.