కరోనా లక్షణాలు లేకున్నా కనిపెట్టేశారు!

  • Published By: srihari ,Published On : May 10, 2020 / 01:25 AM IST
కరోనా లక్షణాలు లేకున్నా కనిపెట్టేశారు!

దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలున్న వారిని గుర్తించి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తుంటారు. కొంతమందిలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా కరోనా ఉండే అవకాశం ఉంది. అలాంటి వారిని గుర్తించడంలో నిర్ధారణ పరీక్షలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతం అయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్‌ కేసుల్లో ఎక్కువ మంది ఎలాంటి లక్షణాలు లేనివారే ఉన్నారు. లక్షణాలు కనిపించని వారికి టెస్టులు జరిపి మిగతా వారికి కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో అధికార యంత్రాంగం విజయవంతమైంది.

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌గా నమోదైన 75 శాతం మంది బాధితుల్లో జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలేవీ కనిపించలేదని పరిశీలనలో తేలింది. ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి వైరస్ సోకిన వారిలో లేకపోవడం అధికారులనూ ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా రాష్ట్రాల్లో లక్షణాలు కనిపించిన తర్వాత కూడా టెస్టులు చేయలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి లక్షణాలు లేకపోయినా కోవిడ్‌ బాధితులను గుర్తించడంలో యంత్రాంగం సక్సెస్ సాధించిందని కేంద్ర బృందం ప్రశంసించింది. 
 
ఇప్పటివరకూ నమోదైన 1,930 పాజిటివ్‌ కేసుల్లో సుమారు 1,500 మంది బాధితులకు కోవిడ్‌ లక్షణాలే కనిపించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్లడంతో లక్షణాలు లేకపోయినా గుర్తించింది. కంటైన్మెంట్‌ క్లస్టర్లు, హాట్‌ స్పాట్లను మ్యాపింగ్‌ చేయడం ద్వారా ఎక్కువ మందికి టెస్టులు చేయడం జరిగింది. ప్రతి పాజిటివ్‌ కేసుకు సంబంధించిన కాంటాక్ట్స్‌ను పూర్తిస్థాయిలో ట్రాకింగ్‌ చేశారు. అందరికి టెస్టులు నిర్వహించడం కూడా మంచి ఫలితాలిచ్చింది. ఢిల్లీ నుంచి, విదేశాల నుంచి వచ్చిన వారి మొత్తం ట్రావెల్‌ రికార్డులను పరిశీలించి పరీక్షలు నిర్వహించారు. 

హాట్‌ స్పాట్లలోనే 40 వేలకు పైగా RTPCR టెస్ట్‌లు నిర్వహించింది. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రత్యేకంగా మ్యాపింగ్‌ చేసి టెస్టులను నిర్వహించింది. కోవిడ్‌–19 లక్షణాలు కనిపించకుండా, వైరస్‌ బారిన పడిన వారిలో ఎక్కువ మంది 40 ఏళ్లలోపు వారే ఉన్నారు. వారిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంది. దీర్ఘకాలిక జబ్బులు లేనివారు కావడం వల్ల వైరస్‌ సోకినా దాని ప్రభావం వారిపై పెద్దగా చూపలేదు. మంచి ఆహార అలవాట్లు, శారీరక శ్రమ చేసే వారిపైనా కరోనా వైరస్‌ ప్రభావం తక్కువగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.