Face Recognition App: ఏపీలో నేటి నుంచి ముఖ ఆధారిత హాజరు.. ఎట్టి పరిస్థితుల్లో యాప్ డౌన్‌లోడ్ చేసుకోమంటున్న ఉపాధ్యాయులు
ఏపీలో ప్రభుత్వం వర్సెస్ ఉపాధ్యాయుల మధ్య రగడ కొనసాగుతూనే ఉంది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులు సమయానికి వచ్చేలా ముఖ ఆధారిత హాజరు (Face Recognition App) విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. స్మార్ట్ ఫోన్ లేకపోతే హెచ్ఎం ఫోన్ నుంచి చేయాలని సూచించింది.

Face Recognition App
Face Recognition App: ఏపీలో ప్రభుత్వం వర్సెస్ ఉపాధ్యాయుల మధ్య రగడ కొనసాగుతూనే ఉంది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులు సమయానికి వచ్చేలా ముఖ ఆధారిత హాజరు (Face Recognition App) విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ విధానం ద్వారా పాఠశాల సమయానికి కొన్ని నిమిషాలు ఆలస్యమైనా ఆ రోజు ఉపాధ్యాయుడికి ఆబ్సెంట్ పడుతుంది. ఉపాధ్యాయులు తమ స్మార్ట్ ఫోన్ లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. సమయానికి పాఠశాలకు వచ్చి ఆ యాప్ ద్వారా ముఖం చూపించి హాజరు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానంపై ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకు మధ్య రగడ కొనసాగుతూనే ఉంది.
ఆగస్టు నెలలోనే ఈ విధానం అమలు చేయాల్సి ఉండగా ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు రావడంతో ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ చర్చలు జరిపారు. ఆగస్టు 18న చర్చలు జరగగా.. విషయం తేలలేదు. ఆగస్టు 31 వరకు హాజరు వేయాలని, అనంతరం మరోసారి సమావేశం అవుతానని మంత్రి బొత్స వారికి సూచించారు. నేటితో ఆ గడువు ముగిసింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 1 నుంచి యాప్ హాజరు తప్పనిసరి అని, ఇందులో ఏ మార్పు లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. అయితే ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఫోన్‌లలో యాప్ డౌన్‌లోడ్ చేసుకోమని స్పష్టం చేస్తున్నారు.
యాప్ ఆధారిత హాజరుపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రేపటి నుంచి మొత్తం యాప్‌లను డౌన్ చేస్తామని ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ సిబ్బందికి ప్రభుత్వమే పరికరాలు కొనుగోలు చేసి ఇచ్చినట్లుగా విద్యాశాఖకు ఇవ్వాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యపై ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ సాయంత్రం చర్చలు జరపనున్నారు. ఆగస్టు 18న తొలి దశ చర్చలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు. ఉదయం 9గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా సెలవు నిబంధన తొలగిస్తామని ఇప్పటికే మంత్రి హామీ ఇచ్చారు. తాజాగా 15రోజులు ఈ హాజరు విధానంపై శిక్షణ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నేటి నుంచి మార్గదర్శకాలు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.