Ganta Srinivasarao: చంద్రబాబుకు గంటా షాక్.. ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్‌ల భేటీకి డుమ్మా..!
ఏపీలో పార్టీని బలోపేతం చేయాలని తీవ్రంగా శ్రమిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇవాళ మరో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి సంబంధించి ఆయనకు అనుకోని పరిణామం ఎదురైంది.

Babu Ganta
Ganta Srinivasarao: ఏపీలో పార్టీని బలోపేతం చేయాలని తీవ్రంగా శ్రమిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇవాళ మరో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర పరిధిలోని 12 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో.. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో సమావేశం నిర్వహిస్తున్నట్టు నేతలకు సమాచారం ఇచ్చారు.
సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబుతో పాటు 12 మంది కీలక నేతలు.. సమావేశానికి రావాల్సి ఉంది. మరోవైపు.. గంటా శ్రీనివాసరావు.. పార్టీ కార్యక్రమాలకు చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. ఇవాల్టి భేటీలో గంటాను చంద్రబాబు వివరణ కోరతారన్న ప్రచారం జరిగింది.
గంటా కూడా.. భేటీకి హాజరవుతారనే అంతా భావించారు. కానీ.. సీన్‌లో సడన్ ట్విస్ట్ ఇచ్చారాయన. తాను సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని సమాచారం ఇచ్చారు. సాధ్యమైనంత త్వరలోనే చంద్రబాబును కలుస్తానన్నారు. విశాఖలో తెలుగు దేశం పార్టీ పరిస్థితిపై.. అధినేతకు త్వరలోనే అభిప్రాయాలు తెలియజేస్తానని పార్టీ వర్గాలకు తెలియజేశారు.
గంటా తీరుపై.. ఉత్తరాంధ్రకు చెందిన 12 నియోజకవర్గాల సమన్వయ సమావేశంలో చంద్రబాబు చర్చిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడమే కాక.. అధినేతగా తాను నిర్వహిస్తున్న భేటీకి కూడా డుమ్మా కొట్టిన గంటా తీరును.. చంద్రబాబు ఎలా ట్రీట్ చేస్తారన్నది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.