AP Govt : ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. సంక్రాంతి నుంచి షురూ.. ఆఫీసులకు వెళ్లక్కర్లేదు..
AP Govt : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి ప్రజలు తమ పనులకోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేదు.
AP Govt : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి ప్రజలు తమ పనులకోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేదు. ప్రభుత్వ సేవలను వచ్చే సంక్రాంతి నుంచి ఆన్‌లైన్లోనే అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
ఆర్టీజీఎస్ (RTGS) వ్యవస్థపై జరిగిన సమీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక సూచనలు చేశారు. ఆన్‌లైన్ సేవలు ప్రజలకు పారదర్శకంగా అందుతాయని, తద్వారా ప్రభుత్వ పనితీరుపై వారిలో సంతృప్తి స్థాయి పెరుగుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
కొన్ని ప్రభుత్వ శాఖలు ఇప్పటికీ ప్రజలకు భౌతికంగానే సేవలు అందిస్తున్నాయని ముఖ్యమంత్రి గుర్తించారు. అలాంటి శాఖలు వెంటనే తమ పనివిధానాన్ని మార్చుకోవాలని.. ప్రజలకు ఆన్‌లైన్లో సేవలు అందించేలా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.
ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌లో అందించడం ద్వారా ప్రజలకు సమయం ఆదా అవుతుందని, పనులు సులభతరం అవుతాయని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలకు కావాల్సిన ప్రభుత్వ సేవలన్నీ, ప్రభుత్వ కార్యాలయాలకు తిరగనవసరం లేకుండా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్సీ ద్వారా అందజేస్తున్నామని అన్నారు. దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.
రిజిస్ట్రేషన్ల తరువాత పత్రాలను కొరియర్ ద్వారా నేరుగా ప్రజల ఇళ్లకు పంపేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.
