నూతన సంవత్సర వేడుకల్లో హింస… కాల్పులకు దారి తీసిన వాట్సప్ మెసేజ్

నూతన సంవత్సర వేడుకల్లో హింస… కాల్పులకు దారి తీసిన వాట్సప్ మెసేజ్

Gunfire between two groups in Kadapa : రాయలసీమలో ఫ్యాక్షన్ భూతం మళ్లీ పడగ విప్పుతోందా…? పాత కక్ష్యలు భగ్గుమంటున్నాయా..? గండ్రగొడ్డళ్లు, వేటకొడవళ్లు, తుపాకులు…నెత్తుటేరులు పారిస్తున్నాయా…? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. వరుస ఘటనలతో కడపలో భయభ్రాంతులు నెలకొన్నాయి. కొన్నాళ్లుగా కాస్త ప్రశాంతంగా ఉన్న జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్యతో ఉలిక్కిపడింది. సుబ్బయ్య హత్య జరిగి వారం రోజులైనా గడవకముందే నూతన సంవత్సర వేడుకల్లో మరోసారి హింస చెలరేగింది. ఇరువర్గాల మధ్య వేటకొడవళ్లతో దాడి జరగడమే కాకుండా..కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలపై కడప జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఫ్యాక్షనిజానికి కేరాఫ్ అడ్రస్ అయిన కడప జిల్లా నిన్న మొన్నటి దాకా శాంతియుతంగా ఉంది. బాంబుల మోతలు, తుపాకి కాల్పులు, వేటకొడవళ్లు, కత్తులు, కటార్ల కరాళ నృత్యం ఉండే కడపలో కొన్నేళ్లుగా ప్రశాంత వాతావరణం నెలకొంది. ఫ్యాక్షన్ గొడవలు మర్చిపోయి..జిల్లా వాసులు శాంతి సామరస్యాలతో జీవిస్తున్నారని అంతా అనుకున్నారు. కానీ అది తప్పని ఇటీవల ఘటనలు రుజువు చేస్తున్నాయి. ప్రొద్దుటూరులో టీడీపీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్యను ప్రత్యర్ధులు దారుణంగా నరికి చంపారు. ఈ హత్య కడప జిల్లాలోనే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నందం సుబ్బయ్య అంత్యక్రియలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హాజరయ్యారు.

సుబ్బయ్య హత్య మర్చిపోకముందే…నూతన సంవత్సర వేడుకల్లో మరోసారి హింస చెలరేగింది. వీరపునాయుని మండలం పాయసం పల్లి గ్రామంలో ఓ వాట్సప్ మెసేజ్ పరస్సర దాడులకు, ఘర్షణలకు దారి తీసింది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్ రెడ్డికి, అదే గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డికి మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా సుధాకర్ రెడ్డి వాట్సప్ గ్రూప్‌లో ఓ మెసేజ్ షేర్ చేశారు. దీనిపై మహేశ్ రెడ్డి తెలుగు వారు ఉగాది వేడుకలు జరుపుకోవాలని, ఇంగ్లీష్ న్యూ ఇయర్ కాదని కామెంట్ చేయడం వివాదానికి దారితీసింది.

బంధువులతో కలిసి తాను కేక్ కట్ చేస్తుండగా మహేశ్ రెడ్డి..తన అనుచరులతో వచ్చి వేటకొడవళ్లతో దాడి చేశాడని సుధాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇరువర్గాల మధ్య రాళ్లదాడి జరిగింది. సుధాకర్ రెడ్డి తుపాకితో కాల్పులు జరిపారు. దాడులు, కాల్పుల్లో చంద్రశేఖర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, రాజారెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సుబ్బయ్య హత్య, సుధాకర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి మధ్య కాల్పుల ఘటనతో కడప జిల్లాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది.