TDP: తెరపైకి బిగ్ బీ.. తెలుగుదేశం పార్టీకి ట్రబుల్ షూటర్స్ దొరికేశారా?

చంద్రబాబు అరెస్టు తర్వాత పరిణామాలు పరిశీలిస్తుంటే బాలయ్య, భువనేశ్వరి, బ్రహ్మణితో కూడిన ట్రిపుల్ బీ.. చాలా పెద్ద స్కెచ్ వేస్తున్నట్లు కనిపిస్తోంది.

TDP: తెరపైకి బిగ్ బీ.. తెలుగుదేశం పార్టీకి ట్రబుల్ షూటర్స్ దొరికేశారా?

Has Telugu Desam Party found trouble shooters

Telugu Desam Party: తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు (Chandrababu) చంద్రబాబు అంటే తెలుగుదేశం పార్టీ అన్నట్లే ఇన్నాళ్లు నడిచింది. పార్టీ కష్టకాలంలో ఉంటే చంద్రబాబుదే బాధ్యత.. ఆపత్కాలంలో ఆదుకోవాల్సిందీ చంద్రబాబే.. మరి మిగతా లీడర్లు ఏం చేస్తారు? బాబు, లోకేశ్ (Nara Lokesh) వంటివారు అందుబాటులో లేకపోతే ఎదురయ్యే కఠిన పరిస్థితులను ఎదుర్కొవడం ఎలా? ఇప్పుడు ఈ ప్రశ్నకు సరైన సమాధానం వెతికే పనిలో పడింది టీడీపీ.. బిగ్ బీని తెరపైకి తెచ్చింది. ఈ ట్రిపుల్ బీ.. ట్రబుల్ షూటర్స్‌గా రంగంలో దింపే ప్లాన్ చేస్తోంది.. తెలుగుదేశం పార్టీలో తెరవెనుక ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

తెలుగుదేశం పార్టీకి ట్రబుల్ షూటర్స్ (trouble shooters) దొరికేశారా? ఆపత్కాలంలో ఆదుకునే వారు లేరనే లోటును టీడీపీ అధిగమించేస్తుందా? అంటే ఔననే అంటున్నాయి తెలుగుదేశం పార్టీ వర్గాలు. బాలకృష్ణ, భువనేశ్వరి, బ్రహ్మణి.. ఈ ట్రిపుల్ బీ.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి బిగ్ బి కానున్నారు. చంద్రబాబు అరెస్టు.. లోకేశ్, అచ్చెన్నాయుడిపై కేసుల కత్తి వేలాడుతున్న సమయంలో పార్టీని నడిపే బాధ్యతను టీడీపీ ట్రిపుల్ బీ తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది.

ఎన్నడూ లేనట్లు.. ఎప్పుడూ లేనట్లు చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrest) తర్వాత జనం మధ్యకు వచ్చారు భువనేశ్వరి. తన భర్త, తండ్రి సుదీర్ఘ రాజకీయాలు చేసిన భువనేశ్వరి (Nara Bhuvaneshwari) ఎప్పుడూ బటయకు వచ్చి మీడియాతో మాట్లాడిన సందర్భాలు లేవు. కాని తొలిసారిగా బాబు అరెస్టు తర్వాత ప్రభుత్వం వేధిస్తోందంటో విమర్శలు చేశారు. ఇక బాలయ్య (Nandamuri Balakrishna) నేరుగా రంగంలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య.. రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉన్నా.. రాష్ట్రస్థాయి కార్యక్రమాలప్పుడు మాత్రమే కనిపించేవారు. ఆయన నేరుగా ఎలాంటి కార్యక్రమానికి రూపకల్పన చేయలేదు.

Also Read: పూర్తిగా ఓపెన్ అయిన పవన్ కళ్యాణ్.. ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతోంది?

చంద్రబాబు అరెస్టు తర్వాత పరిణామాలు పరిశీలిస్తుంటే బాలయ్య, భువనేశ్వరి, బ్రహ్మణితో (Brahmani Nara) కూడిన ట్రిపుల్ బీ.. చాలా పెద్ద స్కెచ్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబును అరెస్టును తట్టుకోలేక మరణించిన కార్యకర్తలు, అభిమానుల కుటుంబాల కోసం ఓదార్పుయాత్ర చేస్తానంటూ ప్రకటించారు బాలకృష్ణ. గతంలో ఎన్నికల ప్రచార సమయంలోనే రాష్ట్రంలో పర్యటించిన బాలయ్య.. పార్టీ కార్యక్రమాల్లో అడపాదడపా మాత్రమే కనిపించేవారు. మహానాడు వంటి వేదికలపై మాత్రమే మాట్లాడేవారు. కానీ చంద్రబాబు అరెస్టు తర్వాత కార్యకర్తలకు నేనున్నా.. అంటూ ధైర్యం నూరిపోసేలా భరోసా ఇచ్చారు. ఓదార్పు యాత్ర ప్రకటన చేసి ఓ అడుగు ముందుకేశారు. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టు నుంచి సానుభూతి పొందాలనే ఆలోచనతో భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా జనం మధ్యకు వెళ్లేలా ప్లాన్ చేస్తోంది టీడీపీ.

Also Read: రహస్యంగా ఢిల్లీకి నారా లోకేశ్.. ఎవరెవరిని కలుస్తారు? ఏం చెబుతారు? ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్

తన భర్తకు అన్యాయం జరుగుతోందని అరెస్టు అయిన తొలిరోజే హైదరాబాద్ నుంచి విజయవాడ దుర్గ గుడికి హుటాహుటిన వచ్చిన భువనేశ్వరి దుర్గ గుడిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత రాజమండ్రి జైలుకి వెళ్లి లోకేశ్, బ్రాహ్మణితో చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఇక ఎప్పుడూ వ్యాపార వ్యవహారాల్లో బిజీగా ఉండే బ్రాహ్మణి కూడా అన్నీ వదిలేసి రాజమండ్రిలో తిష్ట వేశారు. లోకేశ్‌, బాలకృష్ణతో కలిసి పార్టీ వ్యవహారాలను పరిశీలిస్తున్నారు బ్రాహ్మాణి.. మున్ముందు మరింత క్లిష్ట పరిస్థితులు ఎదురైతే పార్టీ క్యాడర్ అండదండలతో ఈ ముగ్గురూ జనం మధ్యకు వెళ్లేలా స్కెచ్ వేస్తోంది టీడీపీ. ఓ వైపు బాలకృష్ణ ఓదార్పు యాత్ర చేస్తే.. భువనేశ్వరి, బ్రాహ్మణి సంయుక్తంగా పాదయాత్ర చేసే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు జనంలోకి వస్తే పార్టీ ఎలా ఉంటుందనే అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బాబు అరెస్టు తర్వాత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ట్రిపుల్ బీతో బిగ్ గేమ్‌కు తెరలేపింది టీడీపీ!