ఏపీలో కుండపోత వర్షాలు…ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి… ఉప్పొంగుతున్న వాగులు, వంకలు

  • Published By: bheemraj ,Published On : August 15, 2020 / 07:09 PM IST
ఏపీలో కుండపోత వర్షాలు…ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి… ఉప్పొంగుతున్న వాగులు, వంకలు

తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఉత్తరకోస్తా, ఒరిస్సా, దానికి ఆనుకుని ఉన్న గ్యాంగ్ టక్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపుకు వంపి తిరుగుతోంది. అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో కుండపోత వానలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీ వణికిపోతోంది. చింతూరు మండలం కుయుగురు బ్రిడ్జీపై నుంచి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఏటపాక మండలం మురుగురు దగ్గర రోడ్డుపైకి వరద నీరు వచ్చి చేరింది. భారీ వర్షాలకు కూనవరం, భద్రాచలం వెళ్లే వాహనాలకు, అలాగే ఆంధ్రా, ఒరిస్సా రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వానలతో సుమారు 10 గ్రామాలకు రాకపోకలు స్థంభించాయి.

తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలానికి పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు పొంచివుంది. ఎగువ నుంచి వస్తున్న వరదనీటిలో పోలవరం ప్రాజెక్టులోని కాపర్ డ్యామ్ దగ్గర భారీగా వరద నీరు వచ్చి చేరింది. కాపర్ డ్యామ్ దగ్గర 27 అడుగులకు పైగా నీటి మట్టం చేరింది. దీంతో దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పూడిపల్లి, తొయ్యేరు, ఎస్సీ కాలనీ, రమణయ్యపేట, దేవీపట్నం గ్రామాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.

ఎమ్ వీరవరం, గబ్బలపాలెం, గానులగొన్ను, ఏనుగులగూడెం గ్రామాల్లోని పొలాల్లోకి వరద నీరు వచ్చింది. పూడిపల్లి సమీపంలోని సీతపల్లి వాగు ఉప్పొంగింది. వరద భయంతో అగ్రహారం నుంచి కొండమొదలు వరకు ఉన్న గిరిజన గ్రామాలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నాయి. వరద ఉదృతి పెరుగుతుండటంతో వరద బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు ఎగువన గోదావరి గట్టు గండి పడింది. గోదావరి నుంచి పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నుంచి గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే, స్పిల్ వే చానెల్ వరద నీటిలో చిక్కుకున్నాయి. కాపర్ డ్యామ్ వద్ద 29 మీటర్లు ఎత్తులో గోదావరి వరద ప్రవహిస్తోంది. దీంతో ప్రాజెక్టు ఎగువన ఉన్న 19 గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరం దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గంట గంటకు వరద పెరుగుతోంది. ఇక ఇన్ ఫ్లో 9 లక్షల 5 వేల 23 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో కూడా అదే స్థాయిలో ఉంది. దీంతో 175 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో వరద ఉధృతి పెరిగింది. వాగులు వంకలు ఉప్పొంగాయి. దీంతో గండి పోచమ్మ ఆలయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. వరదనీటిలో అమ్మవారి విగ్రహం సగ వరకు మునిగిపోయింది.