Maha Shiva Ratri 2022 : శ్రీశైలం క్షేత్రాన్ని ఏ మాసంలో దర్శిస్తే ఏ ఫలితం కలుగుతుంది

ఆంధ్రప్రదేశ్‌లో కొలువైన ప్రముఖ శైవ పుణ్య క్షేత్రాల్లో శ్రీ శైల మహాక్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది. ఈ క్షేత్రం యొక్క దివ్యశక్తి అమోఘమైనది. ఎందరో ఆద్యాత్మిక వేత్తలు ఇక్కడకువచ్చి ధ్యా

Maha Shiva Ratri 2022 : శ్రీశైలం క్షేత్రాన్ని ఏ మాసంలో దర్శిస్తే ఏ ఫలితం కలుగుతుంది

Srisailam

Maha Shiva Ratri 2022 :  ఆంధ్రప్రదేశ్‌లో కొలువైన ప్రముఖ శైవ పుణ్య క్షేత్రాల్లో శ్రీ శైల మహాక్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది. ఈ క్షేత్రం యొక్క దివ్యశక్తి అమోఘమైనది. ఎందరో ఆద్యాత్మిక వేత్తలు ఇక్కడకువచ్చి ధ్యానం చేసుకుని జపం చేసుకుంటూ ఉంటారు. కర్నూలు జిల్లా లోని నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల ఈ శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. నిత్యం శివనామస్మరణతో… హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతుంటుంది

భౌతిక ఇంద్రియాలతో మనం చూడలేని దివ్యత్వం శ్రీశైలములో అణువణువునా వ్యాపించి వుంది. ఎన్నో జన్మల పుణ్యఫలితం వలన మాత్రమే శ్రీశైల దర్శనభాగ్యం కలుగుతుందని స్కాందపురాణములోని శ్రీశైలఖండం చెబుతోంది. శ్రీశైలానికే సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతము, శ్రీశైలము మొదలైన నామాంతరాలున్నాయి.

శ్రీ అనగా సంపద, శైలమంటే పర్వతం కనుక శ్రీశైలమంటే సంపద్వంతమైన పర్వతమని అర్థం. దీనికి శ్రీకైలాసం అనే పేరుతో వ్యవహారం వుండడమూ ఉంది. క్రీ.శ.1313లోని ఒక శాశనాన్ని అనుసరించి దీనికి శ్రీ కైలాసము అనే పేరూ ఉన్నట్టు తెలుస్తోంది. దానిలో మహేశ్వరులు శ్రీకైలాసము (శ్రీశైలం) పైన నివసించారని ఉంది.  అటువంటి శ్రీశైల క్షేత్రాన్ని ఏ మాసములో దర్శిస్తే ఏ ఫలితం లభిస్తుందన్న విషయాన్ని శ్రీపర్వతపురాణం లో చెప్పారు.

1) చైత్ర మాసం – సకల శుభాలు కలుగుతాయి. బహుయజ్ఞాలు ఆచరించిన ఫలం లభిస్తుంది. ఆయుష్షు పెరుగుతుంది.
2) వైశాఖ మాసం – కష్టాలు తీరుతాయి. లక్షగోవులను దానం చేసినంత ఫలం లభిస్తుంది.
3) జ్యేష్ట మాసం – కోరికలు నెరవేరుతాయి. లక్షగోవులను బంగారంతో అలంకరించి దానం చేసినంత ఫలం లభిస్తుంది.

4) ఆషాఢ మాసం – కోటిగోవులను శివాలయానికి దానమిచ్చినంత ఫలం లభిస్తుంది. బంగారు రాశులను దానం చేసిన ఫలం వస్తుంది.
5) శ్రావణ మాసం – యోజనం పొలమును పంటతో సహా పండితునికి దానం చేసినంత ఫలితం లభిస్తుంది.
6) భాద్రపద మాసం – పండితులకు కోటి కపిల గోవులను దానం చేసిన ఫలం లభిస్తుంది.

7) ఆశ్వయుజ మాసం – పాపాలన్ని హరించబడతాయి, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. వేయి కన్యాదానాలు చేసిన ఫలం లభిస్తుంది.
8) కార్తీక మాసం – యజ్ఞాలలో ఎంతో గొప్పదిగా చెప్పబడే వేయి వాజపేయ యాగాలు చేసినంత ఫలం లభిస్తుంది.
9) మార్గశిర మాసం – పాపాలు తొలగిపోతాయి. పౌండరీకయాగం చేసినంత ఫలం లభిస్తుంది.

10) పుష్య మాసం – పాపాలు హరించబడి మోక్షం లభిస్తుంది. అతిరాత్ర యాగం చేసినంత ఫలితం కలుగుతుంది.
11) మాఘ మాసం – శ్రేయస్సు కలుగుతుంది రాజసూయయాగం చేసిన ఫలం లభిస్తుంది.
12) ఫాల్గుణ మాసం – తరగని సంపదలు కలుగుతాయి. సౌత్రామణి యాగఫలం, ఎనలేని పుణ్యాన్ని పొందవచ్చుని శ్రీపర్వతపురాణం లో వివరించారు.