Ambati Rambabu On Polavaram : దానిపై క్లారిటీ వచ్చాకే.. పోలవరం ఎప్పుటికి పూర్తవుతుందో డేట్ చెప్పగలం- మంత్రి అంబటి రాంబాబు

Ambati Rambabu On Polavaram : దానిపై క్లారిటీ వచ్చాకే.. పోలవరం ఎప్పుటికి పూర్తవుతుందో డేట్ చెప్పగలం- మంత్రి అంబటి రాంబాబు

Ambati Rambabu

Updated On : April 23, 2022 / 5:27 PM IST

Ambati Rambabu On Polavaram : పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడానికి మీరంటే మీరే కారణం అని ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. నీటి పారుదల శాఖ మంత్రో లేక అవగాహన లేని మంత్రో అర్థం కావడం లేదంటూ తనపై టీడీపీ నేతలు చేసిన విమర్శలకు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.

డయా ఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి గత ప్రభుత్వ చర్యలే కారణం అని అంబటి రాంబాబు ఆరోపించారు. 2018 కి పోలవరం పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తాం అని బల్లలు గుద్దారని, మరి పూర్తి చేశారా..? అని టీడీపీ నేతలను ఆయన ప్రశ్నించారు. దెబ్బతిన్న డయా ఫ్రమ్ వాల్ పనికొస్తుందా? కొత్తది కట్టాలా? అనే విషయంలో నిపుణులు తర్జనభర్జన పడుతున్నారని చెప్పారు. నిపుణుల నివేదిక రాగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు.(Ambati Rambabu On Polavaram)

Nimmala Rama Naidu : అంబటి రాంబాబు మంత్రో కాదో అర్థం కావడం లేదు-నిమ్మల రామానాయుడు

స్పిల్ వే నిర్మించకుండా డయా ఫ్రమ్ వాల్ కట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు అంబటి రాంబాబు. కాఫర్ డ్యామ్ సగంలో ఉండగానే డయా ఫ్రమ్ వాల్ నిర్మించారని అంబటి రాంబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదాలు చేశారని మండిపడ్డారు. అక్కడ పడిన గుంతలు పూడ్చాలి అంటే రూ.800 కోట్లు ఖర్చు అవుతుందని, నీరు తోడాలంటే రూ.2వేల కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రూ.450 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన డయాఫ్రమ్ వాల్ ఉపయోగం లేకుండా పోయిందన్నారు.

చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్లే నేడు రీ-డిజైన్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మీరు చేసిన తప్పులకు మమల్ని బాధ్యులు చేసేస్తే ఎలా..? అని ఎదురుదాడికి దిగారు మంత్రి అంబటి. దేవినేని ఉమ, రామానాయుడు అపరమేధావుల్లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నేను కొత్త మంత్రిని, నాది మిడిమిడి జ్ఞానమే.. మరి, మీరు పెద్ద మేధావులు కదా. ఎందుకు తప్పు చేశారు? అని మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు.(Ambati Rambabu On Polavaram)

Devineni Uma : ప్రభుత్వ అసమర్థత వల్లే పోలవరం ఆలస్యం : దేవినేని ఉమా

దేవినేని ఉమా.. ఆడో మగో డాక్టర్ కి చూపించి సర్టిఫికెట్ తెచ్చుకో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి. ఐదేళ్లు ఇరిగేషన్ మంత్రిగా డబ్బు సంచులు మొయ్యడం తప్ప ఇంకేమైనా చేశావా? అని దేవినేని ఉమపై ఫైర్ అయ్యారు. డయాఫ్రమ్ వాల్ పై పూర్తిగా క్లారిటీ వస్తేనే, పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందో డేట్ చెప్పగలము అని మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు.

కాగా, మంత్రి అంబటి రాంబాబు పోలవరం డయాఫ్రమ్ వాల్ పై అవగాహన లేకుండా మాట్లాడారని టీడీపీ నేతలు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన రోజే సీఎం జగన్.. పోలవరం ప్రాజెక్ట్ పై విషం చిమ్ముతూ పక్కన పెట్టేశారని ఆరోపించారు. 2020 కి పూర్తవ్వాల్సిన ప్రాజెక్టును 2019 మే లోనే ఎందుకు అర్ధాంతరంగా నిలిపివేశారని ప్రశ్నించారు. కొత్త ఏజెన్సీ లేకుండా ఉన్న ఏజెన్సీని రద్దు చేయటం దేనికి సంకేతం? అని అడిగారు. స్పిల్ వే నుంచి 50 లక్షల క్యూసెక్కుల నీరు మళ్లించే సామర్థ్యం అందుబాటులో ఉండగా ఫ్లడ్ మేనేజ్ మెంట్ ని గాలికొదిలేశారని విమర్శించారు.