ఉత్తరాంధ్రలో బలపడేందుకు జగన్ వ్యూహం

  • Published By: naveen ,Published On : October 3, 2020 / 04:31 PM IST
ఉత్తరాంధ్రలో బలపడేందుకు జగన్ వ్యూహం

jagan new sketch: అధికార వైసీపీ మరోసారి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వేడి పుట్టించాలని ప్లాన్‌ చేసిందంట. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన తర్వాత వైసీపీ విపరీతమైన పొలిటికల్ మైలేజ్‌ను ఆశించింది. నగరంపై పట్టు సాధించడంతో పాటు మెజార్టీ వర్గాల మనసు గెలుచుకోవాలని ప్రయత్నాలు చేసింది. ఇందుకోసం భారీ ప్రదర్శనలతో ఉత్సవ వాతావరణం తీసుకొచ్చేందుకు కార్యచరణ ప్రకటించి, మరీ సందడి సృష్టించింది.

ఈ జోష్‌ను కొనసాగిస్తూనే జీవీఎంసీ ఎన్నికలకు సిద్ధమైంది. అధికార పార్టీ ప్రయత్నాలు ఊపందుకుంటున్న సమయంలో వరుస అవాంతరాలు ఏర్పడ్డాయి. కరోనా వ్యాప్తి చెందడం, ఎన్నికలు వాయిదాతో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు ఇళ్లకే పరిమితం అయ్యారు.

ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ గురి:
ఉత్తరాంధ్రలో వేడిని రగిలించేందుకు వైసీపీ ఎత్తుగడలు ప్రారంభించిందట. పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ ఉత్తరాంధ్ర ప్రజల హక్కు అనే నినాదాన్ని బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమని, అది తమతోనే జరుగుతుందనే ఇండికేషన్ ఇవ్వడం కీలకంగా భావిస్తోందట వైసీపీ. అదే సమయంలో టీడీపీ అనుసరిస్తున్న బీసీ అనుకూల విధానాన్ని తమ వైపు తిప్పుకోవడం మరో ఎత్తుగడగా చెప్పుకుంటున్నారు. వీటన్నింటి నేపథ్యంలోనే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు వల విసిరింది అధికార పార్టీ. సిటీలో ఉన్న నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీలోకి రప్పించుకుంటే… విశాఖలో ఇక తిరుగు ఉండదని భావిస్తోంది.

తొలి వికెట్ వాసుపల్లి గణేష్:
ఈ విషయంలో చాలాకాలంగా మంతనాలు సాగుతున్నాయి. మెుదట గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడతారంటూ ప్రచారం బాగా సాగింది. ముహూర్తాలు సైతం పెట్టుకున్నారని, అదిగో.. ఇదిగో అంటూ వార్తలు వినిపించాయి. కానీ, అందుకు భిన్నంగా తొలి వికెట్ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ కుమార్ రూపంలో పడింది. పార్టీకి వీరవిధేయుడైన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ వంటి వారిపైన ఒత్తిడి అధికంగా ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

వైసీపీ కొత్త ప్లాన్:
విశాఖ దక్షిణం అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ కుమార్‌ మూడో కంటికి తెలియకుండా సీఎంను కలిశారు. చడీచప్పుడు లేకుండా అమరావతి వెళ్లి తన ఇద్దరు కుమారులతో కలిసి వైసీపీకి మద్దతు ప్రకటించి వచ్చారు. పార్టీ వీడిన వాసుపల్లిపై టీడీపీ ఎదురుదాడికి దిగితే ఎమ్మెల్యే పార్టీ మారడం వల్ల పొందాల్సిన అదనపు ప్రయోజనం వైసీపీకి ప్రచారం రూపంలో దక్కలేదనే వాదన ఉంది. అందుకే ఇక నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకునేప్పుడు ప్రతిపక్ష పార్టీ మటాష్ అయిపోయిందనే సంకేతాలను క్షేత్ర స్థాయిలోకి బలంగా పంపించాలని ప్లాన్‌ చేసుకుందంట.

వైసీపీలో గంటా శ్రీనివాసరావు ఎంట్రీ కూడా అప్పుడే అని ప్రచారం:
అభివృద్ధి కేంద్రంగానే ఇదంతా జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడమే కీలకంగా భావిస్తున్నారట వైసీపీ నేతలు. ఇందులో భాగంగానే చేరికలన్నీ విశాఖలోనే జరపాలని, అది కూడా అభివృద్ధి కోసం నిర్దేశించిన వేదికలపై జరిగితేనే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

న్యాయపరమైన ఇబ్బందులను అధిగమిస్తే విజయదశమి నాటికి విశాఖ కార్యనిర్వాహక రాజధానికి భూమి పూజ ఉంటుంది. అదీ ముఖ్యమంత్రి చేతుల మీదుగానే నిర్వహించేందుకు అవకాశాలు ఎక్కువ. ఆ వేడుకను భారీ స్థాయిలో నిర్వహిస్తారని భావిస్తున్నారు. గంటా శ్రీనివాసరావు ఎంట్రీ కూడా అప్పుడే జరుగుతుందనే ప్రచారం నలుగుతోంది.

ఎన్ఏడీ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం వేదికగా మరో ఎమ్మెల్యే జంప్:
మరోపక్క, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు సైతం పార్టీ మారితే పదవుల కోసం కాకుండా అభివృద్ధి కోసమే అధికార పార్టీకి మద్దతు ప్రకటించానని చెప్పుకునేలా ఆలోచనలు జరుగుతున్నాయట. ఇందుకు ఎన్ఏడీ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం వేదికగా ఉంటుందని చెప్పుకుంటున్నారు.

విశాఖ నగరంలో అత్యంత ముఖ్యకూడళ్లలో ఒకటైన ఎన్ఏడీ వంతెన పనులు డిసెంబర్ నాటికి పూర్తి కానున్నాయి. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి చేసుకున్న పెద్ద ప్రాజెక్ట్ ఇది. దీనిని సీఎం చేతుల మీదుగానే ప్రారంభింపజేయాలని… అప్పుడే గణబాబును చేర్చుకోవాలని ప్లాన్‌. మరి ఇవన్నీ ఏ మేరకు వర్కవుట్‌ అవుతాయో చూడాలంటున్నారు.