AP PRC: పీఆర్సీపై నేడు కీలక పరిణామాలు.. మధ్యాహ్నం సీఎంతో ఉద్యోగ సంఘాల భేటీ..?

శుక్రవారం సాయంత్రం మొదలై.. అర్థరాత్రి వరకు.. సుమారు నాలుగున్నర గంటల పాటు జరిగిన చర్చల్లో.. తమ డిమాండ్లను మరోసారి ఉద్యోగ సంఘాల నేతలు కాస్త గట్టిగానే వినిపించారు.

AP PRC: పీఆర్సీపై నేడు కీలక పరిణామాలు.. మధ్యాహ్నం సీఎంతో ఉద్యోగ సంఘాల భేటీ..?

Prc Disc

AP PRC: పీఆర్సీ వివాదంపై.. ఉద్యోగులు బెట్టు వీడడం లేదు. డిమాండ్ల సాధన కోసం పట్టు వదలడం లేదు. శుక్రవారం సాయంత్రం మొదలై.. అర్థరాత్రి వరకు.. సుమారు నాలుగున్నర గంటల పాటు జరిగిన చర్చల్లో.. తమ డిమాండ్లను మరోసారి ఉద్యోగ సంఘాల నేతలు కాస్త గట్టిగానే వినిపించారు. ఈ క్రమంలో.. ఇవాళ (శనివారం) రోజంతా మరోసారి కీలక పరిణామాలు జరగనున్నాయి. నిన్నటి చర్చలపై.. ఉదయం 10 గంటలకు మంత్రుల కమిటీ మళ్లీ భేటీ కానుంది. తర్వాత.. మధ్యాహ్నం 2 గంటలకు.. ఉద్యోగ సంఘాల నేతలతో మరోసారి చర్చలు జరపనుంది. ఆ తర్వాత.. సంఘాల నేతలు.. ముఖ్యమంత్రి జగన్ ను కలిసే అవకాశం ఉంది.

మరోవైపు.. సమావేశం ముగిసిన తర్వాత.. ప్రభుత్వ సలహాదారు సజ్జల మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల్లో ఉన్న అనుమానాలు తీర్చే ప్రయత్నం చేశామన్నారు. వారు ఆశించిన మేరకు చర్యలు తీసుకునేలా కసరత్తు చేశామని చెప్పారు. ఫిట్మెంట్, ఐఆర్ రికవరీ, హెచ్ఆర్ఏతో పాటు చాలా అంశాలు మాట్లాడినట్టు వివరించారు. చర్చలు ఆశాజనకంగా జరిగాయని.. శనివారం మరోసారి అంతా కలిసి మాట్లాడతామని అన్నారు. ఉద్యోగులతో కలిసి మునుపటిలాగే పని చేయాలన్నది తమ ఆకాంక్షగా సజ్జల స్పష్టం చేశారు.

ఇదే విషయమై.. ఉద్యోగ సంఘాల నేతలు సూర్యనారాయణ, బండి శ్రీనివాసులు, వెంకటరామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వరరావు సైతం.. మీడియాతో మాట్లాడారు. చర్చలు ఆశాజనకంగా జరిగాయన్నారు. అయితే.. పూర్తి స్థాయి ఫలితం ఇంకా రాలేదని.. ముందుగా నిర్ణయించుకున్న ఆందోళన కార్యక్రమాలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేశారు. ఉద్యోగులకు కొంత కాలంగా జరిగిన నష్టానికి నివారణ చేస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చిందన్నారు. ఇప్పటికే కొన్ని విషయాలపై ఏకాభిప్రాయం వచ్చిందన్న నేతలు.. శని, ఆదివారాల్లోనూ తమ కార్యాచరణ కొనసాగుతుందని తేల్చి చెప్పారు. చర్చలు పూర్తై.. తమ డిమాండ్లు సాధించే వరకూ ఆందోళనలు ఆపేది లేదన్నారు.

Read More:

AP PRC: పీఆర్సీపై మంత్రులతో ముగిసిన ఉద్యోగ సంఘాల కీలక భేటీ.. పరిష్కారం దిశగా సంకేతాలు..!