కోట్ల హర్ష వర్సెస్ ఎమ్మెల్యే సుధాకర్, కోడుమూరు వైసీపీలో వర్గపోరు, అయోమయంలో కార్యకర్తలు

  • Published By: naveen ,Published On : October 13, 2020 / 02:53 PM IST
కోట్ల హర్ష వర్సెస్ ఎమ్మెల్యే సుధాకర్, కోడుమూరు వైసీపీలో వర్గపోరు, అయోమయంలో కార్యకర్తలు

kodumuru ysrcp: కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ ఒంటరి పోరు సాగిస్తున్నారని అంటున్నారు. మండల స్థాయి నాయకులు మాత్రమే ఆయన వెంట నడవగా, నియోజకవర్గంలో కొంతమంది సహకరించడం లేదని చెబుతున్నారు. ఎమ్మెల్యే పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేస్తున్నారు. నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి వెనుకే పార్టీలోని కొంతమంది నేతలు ఉండడంతో కోడుమూరు వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. నియోజకవర్గంలో కోట్ల హర్ష వర్సెస్ ఎమ్మెల్యే సుధాకర్ అన్న రీతిలో వైసీపీ కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం చర్చనీయాంశం అయ్యింది.

సుధాకర్ గెలుపు కోసం కృషి చేసిన కోట్ల:
కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వైసీపీలో చేరి సుధాకర్‌ గెలుపు కోసం కృషి చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య ఎక్కడ బెడిసి కొట్టిందో కానీ.. భేదాభిప్రాయాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుంచి సుధాకర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. కోడుమూరు పట్టణానికి ఐటీఐని మంజూరు చేయించారు. సుధాకర్ చేస్తున్న పనులతో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు పెరిగాయి.

ఏ కార్యక్రమానికైనా కోట్ల హర్షకే ఆహ్వానం:
కాకపోతే నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షకు ఉన్న క్రేజ్ ముందు ఎమ్మెల్యే సుధాకర్‌ నిలబడలేకపోతున్నారని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు, పార్టీ సమావేశాలకు ఎమ్మెల్యే సుధాకర్ హాజరైతే కోట్ల హర్షవర్ధన్ రెడ్డి హాజరు కావడం లేదు. దీంతో పార్టీలోని ముఖ్య నేతలంతా పార్టీ సమావేశాలకు హాజరుకాకపోవడంపై పెద్ద చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో ఏ షాపు ప్రారంభానికైనా, కార్యక్రమానికైనా కోట్ల హర్షనే ఆహ్వానిస్తారు తప్ప ఎమ్మెల్యేకు పిలుపు ఉండదని అంటున్నారు

అయోమయంలో కార్యకర్తలు:
ఇద్దరి మధ్య విభేదాలు ఏ స్థాయికి చేరాయంటే ఎమ్మెల్యేకు తెలియకుండానే కోట్ల హర్ష సమక్షంలో ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి చేరుతున్నారు. అధికారులు ఎమ్మెల్యే సిఫారసుల కంటే హర్ష చెప్పిన పనులకే ప్రాధాన్యం ఇస్తున్నారట. దీంతో ఎవరి పక్షాన వెళ్లాలో కార్యకర్తలకు దిక్కు తోచడం లేదని అంటున్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం అందరినీ ఏకతాటిపై తెచ్చేందుకు సుధాకర్ ప్రయత్నిస్తున్నా కోట్ల హర్ష అనుచరులు మాత్రం సహకరించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యే సుధాకర్ వన్ మ్యాన్ ఆర్మీగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందంటున్నారు.