KTR దిశా నిర్దేశం : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

  • Published By: madhu ,Published On : January 17, 2020 / 01:10 AM IST
KTR దిశా నిర్దేశం : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంపై TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఫోకస్ చేశారు. కౌన్సిలర్‌, కార్పొరేటర్ అభ్యర్థులు.. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అతివిశ్వాసంతో ఉండకుండా అందరినీ కలుపుకొని పోయి ఓట్లు అడగాలని ఆదేశించారు. టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్‌ అభ్యర్థులతో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 2020, జనవరి 16వ తేదీ గురువారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయా వార్డుల్లో తాజా రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలపై అధిష్టానం ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటునందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచార సరళి, అనుసరించాల్సిన వ్యూహాలపై  అభ్యర్థులకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 

*  మున్సిపాలిటీలకు భారీగా నిధులిచ్చిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ అభ్యర్థులకు మార్గనిర్దేశం.
*  పట్టణాల్లో 75 గజాల్లోపు ఇంటి నిర్మాణానికి అనుమతులు అవసరం లేదు.
*  75 గజాల ఇంటి స్థలం ఉన్నవారికి 22 రోజుల్లో అనుమతులు.
*  కొత్త మున్సిపాలిటీ చట్టాన్ని కఠినంగా అమలు.
*  తెలంగాణ మున్సిపాలిటీలను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.

రెబెల్స్ రంగంలో ఉన్న మున్సిపాల్టీ లపై కేటీఆర్ ప్రత్యేక దృష్టిసారించారు. వీరు పోటీ చేస్తున్న మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్‌ తప్పకుండా గెలవాలని నేతలను ఆదేశించారు. పార్టీ ఎవరికి గుర్తు కేటాయిస్తే వాళ్లే టీఆర్ఎస్‌ అభ్యర్థులన్న విషయాన్ని కార్యకర్తలంతా గుర్తించాలని.. కారు గుర్తుపై పోటీ చేసేవారికే టీఆర్ఎస్‌ సభ్యులంతా మద్దతు తెలపాలని సూచించారు కేటీఆర్. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గెలుపు టీఆర్ఎస్‌దేనని.. అభ్యర్థులంతా ఆత్మవిశ్వాసంతో పనిచేయాలని సూచించారు. అయితే అతివిశ్వాసంతో ఉంటే మాత్రం ఫలితాలు తలకిందులవుతాయని.. నేతలంతా చిత్తశుద్ధితో ప్రచారం నిర్వహించాలని సూచించారు. 

టీఆర్ఎస్‌ నేతలు మున్సిపాలిటీలవారీగా మేనిఫెస్టోలు రూపొందించాలని సూచించారు కేటీఆర్. ప్రతీ ఇంటికి రెండు మూడుసార్లు వెళ్లి ఓట్లు అడగాలన్నారు. రాష్ట్రంలో 3వేల వార్డుల్లో పోటీ జరుగుతుంటే బీజేపీకి  వెయ్యి వార్డుల్లో.. కాంగ్రెస్‌కు 500 వార్డుల్లో అభ్యర్థులే లేరని విమర్శించారు. ఆ పార్టీల బీఫారాలు తీసుకునేందుకు కూడా ఎవరూ ముందుకురాలేదన్నారు. 

Read More : అప్పుడిలా..ఇప్పుడిలా : గ్లాస్‌లో పువ్వు..కామ్రేడ్లకు పవన్ షాక్