చిరంజీవి రాజకీయాల్లో రీ ఎంట్రీకి రెడీ చేస్తున్న సోము వీర్రాజు.. అదీ బీజేపీలోకి నిజమేనా!!

చిరంజీవి రాజకీయాల్లో రీ ఎంట్రీకి రెడీ చేస్తున్న సోము వీర్రాజు.. అదీ బీజేపీలోకి నిజమేనా!!

భారతీయ జనతాపార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించడంతో బాధ్యతలు చేపట్టారు. అంతా బాగానే ఉంది. ఈ సమయంలో కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్‌ చిరంజీవిని స్వయంగా వెళ్లి కలుసుకోవడం చర్చనీయాంశం అయింది. ఈ సందర్భంగా సోము వీర్రాజును చిరంజీవి అభినందించడం బాగానే ఉంది. మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ముందుగా కలుసుకోకుండా చిరంజీవిని ఎందుకు కలుసుకున్నారనే చర్చ మొదలైంది.

ఈ సందర్భంగా మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, జనసేన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వీర్రాజుతో చిరంజీవి అన్నారు. పవన్ కళ్యాణ్ సహకారంతో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. బీజేపీ బయటకు చెబుతున్న విషయం ఇది. ఈ కలయిక వెనుక రాజకీయ కోణం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు రాష్ట్రంలో రెండు అగ్రవర్గాలకు చెందిన పార్టీలైన వైసీపీ, టీడీపీ పార్టీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ పార్టీలకి ధీటుగా ఉండాలంటే మరొక బలమైన సామాజికవర్గం ఉండాలని, అందుకే కాపు సామాజికవర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ ఎంపిక చేసుకుంది. ఆ తర్వాత కన్నా స్ధానంలో వేరే వ్యక్తుల పేర్లు వినపడినా మరలా అదే సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజునే అధిష్టానం బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక చేసింది.

ఎక్కువ ఓటర్లు ఉండటమే కాకుండా బలమైన సామాజికవర్గం కావటంతో బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే సామాజికవర్గం కావడం ఆ రెండు మిత్ర పక్షాలుగా ఉండటం కలిసొచ్చే అంశం.

ఈ అంశాలన్నింటికీ తోడుగా మరింత బలం చేకూరాలంటే కాపు నేతల్ని, బలమైన నేతల్ని దగ్గరకి తీసుకునే పనిలో బీజేపీ పడింది. చిరంజీవిని సోము వీర్రాజు కలిశారని అంటున్నారు. రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషించి మళ్లీ సినిమాల్లోకి వచ్చి తన చరిష్మా తగ్గలేదని నిరూపించుకున్నారు. దీంతో ఆయన వెనుక ఉంటే పార్టీకి మరింత హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో వీర్రాజు చిరుని కలిశారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అదీకాక చిరంజీవి కూడా తన తమ్ముడి సహకారంతో ముందుకెళ్లాలని సోము వీర్రాజుకి సూచించడం ఈ ప్రచారానికి ఆజ్యం పోసింది. ఇప్పటికే సోము వీర్రాజు జనసేన, బీజేపీల ఓట్లు 20 శాతమని, దీనికి తగ్గట్టు పని చేస్తూ మరింత బలం చేకూరేలా ముందుకు వెళ్తామని అధ్యక్షుడిగా వచ్చిన రోజునే స్పష్టం చేశారు. బీజేపీలోకి చిరంజీవి చేరుతున్నారన్న వార్తలు గతంలో కూడా వినిపించాయి.

ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బీజేపీ చిరంజీవిని లాగడానికి బాగానే ప్రయత్నం చేసింది. కాకపోతే చిరు సైడ్ నుంచి మాత్రం క్లారిటీ లేదు. ఇప్పుడు మళ్లీ చిరంజీవిని సోము వీర్రాజు కలవడం మరోసారి చర్చనీయాంశం అయింది. ఇంతకీ బీజేపీ, జనసేనలకు చిరంజీవి పరోక్షంగా మద్దతు ఇస్తున్నారా? 2024 లోపు బీజేపీలోకి చేరి మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా అన్నది ఆయనే చెప్పాలంటున్నారు.