ఏలూరులోని మొత్తం 77వార్డుల్లో 34 వార్డుల్లోనే ప్రభావం…నీటిలో ఎలాంటి కలుషితాలూ లేవని నిర్ధారణ

  • Published By: bheemraj ,Published On : December 8, 2020 / 06:13 PM IST
ఏలూరులోని మొత్తం 77వార్డుల్లో 34 వార్డుల్లోనే ప్రభావం…నీటిలో ఎలాంటి కలుషితాలూ లేవని నిర్ధారణ

mystery illness eluru : ఏలూరును గజగజలాడిస్తున్న వైరస్‌కు సంబంధించి మంగళగిరి ఎయిమ్స్‌ ఇచ్చిన ప్రాథమిక నివేదిక వెలుగులోకి వచ్చింది. వైరస్‌ వల్ల ఆహారం, నీళ్లు కలుషితం అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. భార లోహాలు లేదా రసాయన మూలకాలు కలవడం వల్ల కూడా ఇలా జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేసింది. ఏలూరులో ఈ పరిస్థితి ఈ మూడు రోజుల్లో కాదని ఒకటో తారీకు నుంచే ఈ పరిస్థితి ఉందని వెల్లడించింది. ఒకటో తారీకు నుంచే కొంతమంది అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరినట్లు తేల్చింది.



అయితే ఐదో తేదీ రాత్రి 8గంటల తర్వాత ఒక్కసారిగా కేసుల సంఖ్య భారీగా పెరిగిందని నిర్థారించింది. ఏలూరులోని మొత్తం 77వార్డ్డుల్లో 34వార్డుల్లోనే ఈ పరిస్థితి ఉందని కమిటీ గుర్తించింది. అయితే ఈ 34వార్డులకు పంపుల చెరువు నుంచే నీరు సరఫరా అవుతోంది. ఏలూరు మున్సిపాలిటీ ఈ నీటిని సప్లయ్‌ చేస్తోంది. అయితే మంచినీరు లేదా ఆహారం విషపూరితం కావొచ్చని ఎయిమ్స్‌ చెప్పినప్పటికీ విజయవాడ ల్యాబు ఫలితాలు మాత్రం నీటిలో ఎలాంటి ఇబ్బందులు లేవని తేల్చాయి.



మంచినీటిలో ఎలాంటి భారలోహాలు కలవ లేదని నీరు వినియోగానికి అనుకూలమైనవేనని ఆ రిపోర్టులు తేల్చాయి. బాధితుల రక్త నమూనాలు నార్మల్‌గానే ఉన్నట్లు గుర్తించారు. డెంగ్యూ, చికెన్ గున్యా కూడా కారణం కాదని నిపుణులు తేల్చి చెప్పారు.

సీటీ స్కాన్‌ రిపోర్టు కూడా నార్మల్‌ గానే ఉన్నట్లు గుర్తించారు. 14 వాటర్ శాంపిల్స్‌ను నిపుణులు పరిశీలించారు. నీటిలో ఎలాంటి కలుషితాలూ లేవని నిర్ధారణ చేశారు. భారలోహాల నిర్ధారణ కోసం నీటిని విజయవాడ ల్యాబ్‌కు పంపించారు. అయితే విజయవాడ పరీక్షల్లోనూ నీరు సురక్షితమేనని నిర్ధారణ అయింది.



బాధితులందరికీ ర్యాపిడ్ కోవిడ్ పరీక్షలు జరుపగా అందరికీ నెగెటివ్ రిజల్ట్‌ వచ్చాయి. కొన్నిరోజులుగా నీటి రంగు మారినట్లు కొందరు బాధితులు చెప్పారని నిపుణులు తెలిపారు. వైరస్‌ కలిసిన నీళ్లు లేదా ఆహారం కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. భారలోహాలు లేదా రసాయన మూలకాలు కారణం కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఎయిమ్స్‌ ప్రాథమిక నివేదికలో ఈ అంశాలను కూడా పేర్కొన్నారు. అయినా నీటి కాలుష్యంపైనే ప్రధానంగా వారు అనుమానాలు వ్యక్తం చేశారు.