ఏలూరులో వింతవ్యాధి కలకలం..589కి పెరిగిన బాధితుల సంఖ్య

  • Published By: bheemraj ,Published On : December 9, 2020 / 04:59 PM IST
ఏలూరులో వింతవ్యాధి కలకలం..589కి పెరిగిన బాధితుల సంఖ్య

mystery illness in eluru : ఏలూరులో అంతుచిక్కని వ్యాధి కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇవాళ ఇప్పటిదాకా 20 మంది వ్యాధి లక్షణాలతో ఆస్పత్రికి వచ్చారు. రాత్రి ఆరు కేసులు మాత్రమే నమోదవడంతో వ్యాప్తి కాస్త తగ్గిందని అంతా భావించారు. కానీ ఉదయం తర్వాత పరిస్థితి మారిపోయింది. బాధితుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తరోగులతో కలిపి మొత్తం అంతుచిక్కని వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 589కి పెరిగింది.



వారిలో 470 మంది చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో, ఆశ్రం ఆస్పత్రిలో 89 మంది చికిత్స పొందుతున్నారు. 30 మంది విజయవాడ, గుంటూరు ఆస్పత్రుల్లో ఉన్నారు. నేషనల్ సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ ప్రతినిధుల బృందం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించింది.



అటు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల బృందం కేసులు నమోదు అవుతున్న కాలనీల్లో పర్యటించనుంది. ఇప్పటికే 40 మంది పేషేంట్స్ నుంచి మంగళగిరి ఎయిమ్స్ బృందం శాంపిళ్లు సేకరించింది.

కొత్తగా మరో 30 మంది పేషేంట్స్ నుంచి శాంపిళ్లు సేకరించాలని ఢిల్లీ డాక్టర్లు సూచించారు. ఫిట్స్ తో బాధపడుతున్న పేషేంట్స్ వీడియోలు ఉంటే ఇవ్వాలని, లేకుంటే తియ్యాలని వైద్య సిబ్బందిని ఎయిమ్స్ బృందం కోరింది.



ఇప్పటికే తొలి దశ నమూనాల్లో సీలం, నికెల్ లోహాలున్నట్టు ప్రాధమికంగా నిర్ధారించారు. ఢిల్లీ ఎయిమ్స్‌ మలివిడత పరీక్షల్లోనూ ఇదే నిర్ధారణ అయ్యింది. నీటి నమూనాలను ల్యాబ్‌లలో పరిశీలిస్తే సీసం, నికెల్‌ అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. కూరగాయల సాగులో ఎక్కువ రసాయనాలు వాడడం, పాలు కల్తీ కావడంపైనా పరిశోధన జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పాలు, కూరగాయల నమూనాలను ఢిల్లీకి పంపారు.