కాబోయే సీఎంని అన్నాడు, లక్షల కోట్లతో అభివృద్ధి చేస్తానన్నాడు, ఇప్పుడు అడ్రస్ లేడు.. కేఏ పాల్ రాక కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఆ నియోజకవర్గం ప్రజలు

  • Published By: naveen ,Published On : October 27, 2020 / 03:58 PM IST
కాబోయే సీఎంని అన్నాడు, లక్షల కోట్లతో అభివృద్ధి చేస్తానన్నాడు, ఇప్పుడు అడ్రస్ లేడు.. కేఏ పాల్ రాక కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఆ నియోజకవర్గం ప్రజలు

ka paul: కేఏ పాల్… ప్రపంచానికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఎందుకంటే ఒకప్పుడు సొంత విమానాలతో ప్రపంచం మొత్తం చుట్టేసిన వ్యక్తి ఆయన. అగ్రరాజ్యం అమెరికా నుంచి చిన్న దేశం క్యూబా వరకు అన్ని దేశాల అధ్యక్షులను క్షణాల్లో కలిసిన వ్యక్తి. ఆయన అనుకుంటే ఇప్పుడు కూడా దేశాధినేతలను కలవగలరు. కానీ, ఇప్పుడు కేఏ పాల్‌ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించడం లేదు. మాటలను గ్యాప్‌ లేకుండా యమ స్పీడ్‌గా చెప్పేసే ఆయన.. ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో జనాలు ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు.




పాల్ ఎక్కడున్నారని అడుగుతున్నారు:
గత ఎన్నికలకు ముందు కేఏ పాల్‌ చూపు ప్రపంచ దేశాలను కాదని ఆంధ్రప్రదేశ్‌పై పడింది. కాకపోతే తాను ప్రపంచం మొత్తం తిరిగి చేసే మత బోధన కోసం, శాంతిదూత అనే పేరుకు తగ్గట్టు శాంతిని నెలకొల్పడానికి మాత్రం కాదు. రాజకీయాల్లో ఏదో చేయాలనుకొని ఎంటర్‌ అయ్యారు. పార్టీని స్థాపించి పోటీకి సిద్ధమయ్యారు. తానే కాబోయే సీఎం అంటూ ఊదరగొట్టారు. మరిప్పుడు కనీసం నియోజకవర్గం వైపు కూడా చూడకపోవడంతో ఎక్కడున్నారంటూ ప్రజలు అడుగుతున్నారు.
https://10tv.in/group-politics-in-patancheru-congress/
ఎమ్మెల్యేగా నామినేషన్, ఎంపీగా పోటీ:
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయాలని డిసైడ్‌ అయ్యారు కేఏ పాల్‌. ప్రజాశాంతి పార్టీని నెలకొల్పి రాష్ట్రంలో అనేక మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఫాంలు కూడా ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల్లో తన సత్తా చూపించి, ప్రజాశాంతి పార్టీని గెలిపించి, ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలిస్తానని చెప్పుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగానూ పాల్‌ బరిలో దిగారు.

గాలిలో ముద్దులు పెడుతూ చిత్రవిచిత్ర హావభావాలతో ఎన్నికల ప్రచారం:
నామినేషన్ వేసింది మొదలు తనదైన హావభావాలతో ప్రచారాన్ని కొత్త రకంగా, తనకు ఇష్టం వచ్చినట్లు పూర్తి చేసేశారు కేఏ పాల్‌. ఆ మధ్యలో పిడుగు లాంటి వార్త కేఏ పాల్‌కు తెలిసింది. భీమవరం అసెంబ్లీ అభ్యర్థిగా వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో కొంత నిరాశ చెందినా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండటంతో పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రం మొత్తం చేయాల్సిన ప్రచారాన్ని గాలికి వదిలేసి, గాలిలో ముద్దులు పెడుతూ చిత్రవిచిత్ర హావభావాలతో నరసాపురంలో మాత్రమే ప్రచారం కొనసాగించారు.

తనని గెలిపిస్తే లక్షల కోట్ల రూపాయలు తెస్తానన్నారు:
ఎన్నికల ప్రచారంలో తనకు ప్రపంచ దేశాల అధినేతలు అందరూ తెలుసని, తనని గెలిపిస్తే లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని పాల్‌ హామీలు గుప్పించారు. అన్ని రాజకీయ పార్టీలకు తన గెలుపుతోనే సమాధానం చెప్తానని సవాల్ చేసిన కేఏ పాల్.. ఎన్నికల ఫలితాల తర్వాత బోల్తా పడ్డారు. ఎన్నికల ఫలితాలొచ్చిన రోజే పాల్‌కు పశ్చిమ గోదావరి జిల్లాతో చివరి రోజు అయ్యింది.

పాల్‌కు 3037 ఓట్లు:
నరసాపురం పార్లమెంటు నుంచి పోటీ చేసిన పాల్‌కు 3037 ఓట్లు వచ్చాయి. తనదే గెలుపు అని ముందు నుంచి చెప్పుకొచ్చిన కేఏ పాల్‌కు ఊహించని ఓట్లు వచ్చే సరికి జిల్లా వైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయలేకపోయారు. ఇప్పుడు నరసాపురం నియోజకవర్గం ప్రజలు పాల్ రాకకోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు. లక్షల కోట్లు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పిన పాల్.. ఇప్పుడు నియోజకవర్గంలోకి రావాలని కోరుతున్నారు.




నరసాపురం వచ్చి సమస్యలు తీర్చాలని కోరుతున్న ప్రజలు:
కోవిడ్ విజృంభిస్తున్నప్పటి నుంచి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు నియోజకవర్గానికి దూరంగా ఉండటం, నియోజకవర్గంలో అధికార పార్టీ ఎంపీ చేయాల్సిన అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో నియోజకవర్గాన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడానికి పాల్ ఎక్కడ ఉన్నా నరసాపురం రావాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కొన్ని నెలలుగా అమెరికాలో ఉండి వీడియోల ద్వారా మాత్రమే కనిపిస్తున్న కేఏ పాల్.. నరసాపురం నియోజకవర్గానికి వచ్చి ప్రజల సమస్యలను తీర్చాలని కోరుతున్నారు.

కేఏ పాల్ నియోజకవర్గం ప్రజల కోరికను నెరవేరుస్తారా?
అన్ని మాటలు చెప్పిన కేఏ పాల్‌.. ఒక్క ఓటమితో కనిపించకుండా పోవడం ఏంటని అడుగుతున్నారు. ఎన్నికల సమయంలోనే కాదు.. ప్రజల కష్ట సమయాల్లోనూ దగ్గరుంటేనే ఆదరిస్తారనే విషయాన్ని పాల్‌ తెలుసుకోలేకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రచారంలో అంత గొప్పలు చెప్పుకొన్న పాల్‌.. ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదని అడుగుతున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి, చూపించాలని అంటున్నారు. మరి కేఏ పాల్ నియోజకవర్గం ప్రజల కోరికను నెరవేరుస్తారా?