నెల్లూరు పెద్దారెడ్డికి ఏమైంది? ఎక్కడున్నారు? ఎందుకు జిల్లాకు దూరంగా ఉంటున్నారు?

  • Published By: naveen ,Published On : October 5, 2020 / 05:12 PM IST
నెల్లూరు పెద్దారెడ్డికి ఏమైంది? ఎక్కడున్నారు? ఎందుకు జిల్లాకు దూరంగా ఉంటున్నారు?

nellore pedda reddy: నెల్లూరు పెద్దారెడ్డి.. ఈ పేరు నెల్లూరులోనే కాదు.. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ చెరగని ముద్ర వేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశ రాజకీయాల్లోనూ అనేక మంది రెడ్లు ఉండగా ఈ పేరు నెల్లూరుకే పరిమితమైంది. రాజకీయ ఉద్దండులను అందించిన నెల్లూరులో పెద్దారెడ్డి పాత్రకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బెజవాడ గోపాలరెడ్డి, పాపిరెడ్డి, పెళ్లకూరు రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, దొడ్ల సుబ్బారెడ్డి, ఆనం చెంచు సుబ్బారెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఆనం వివేకానందరెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి సహా అనేక మంది ఈ పెద్దారెడ్డి పేరుని సార్థకత చేసుకున్నారు.

పెద్దారెడ్డి స్థానాన్ని భర్తీ చేసిన ఆదాల:
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ పెద్దారెడ్డి స్థానాన్ని జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి భర్తీ చేశారు. దాదాపు 20 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ముందు వరకు నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటూ ఉన్నట్టుండి పార్టీ జెండా మార్చేసి ఫ్యాన్ గూటికి చేరి, ఇటు జిల్లా ప్రజలకు, అటు టీడీపీకి ఊహించని షాక్ ఇచ్చారు. అంతలోనే నెల్లూరు లోక్‌సభ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించి నెల్లూరు పెద్దారెడ్డిగా స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.. తొలిసారిగా లోక్‌సభలో అడుగు పెట్టి అనేక సమస్యలను అంశాలను సభ దృష్టికి తెచ్చారు.

ఆదాల చేయాల్సిన పనులన్నీ ఆయనే చేస్తున్నారు:
ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం ఆదాల ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు జిల్లాలో కనిపించడం లేదు. దాదాపు 5 నెలలుగా ఆయన నెల్లూరుకి దూరంగా ఉంటున్నారు. ఢిల్లీ, హైదరాబాద్‌లకే పరిమితమయ్యారు. ఆయన పాల్గొనాల్సిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిలోనూ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడైన నెల్లూరు విజయా డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పాల్గొంటుండడం చర్చనీయాంశం అయ్యింది. అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులను ఎంపీ ప్రభాకర్ రెడ్డి జిల్లాకు మంజూరు చేస్తుంటే, వాటి పర్యవేక్షణ, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు రంగారెడ్డి హాజరవుతున్నారు. కొద్ది నెలలుగా ఇదే పరిస్థితి ఉండడంతో రాజకీయ వర్గాల్లో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది.

ఆ కారణంతోనే నెల్లూరుకి రాలేకపోతున్నారా?
నిధుల సమస్యను పరిష్కరించడంలో భాగంగానే తాను జిల్లాకు రాలేకపోతున్నానని, ప్రజా సమస్యల పరిష్కారంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులూ లేవంటూ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ నుంచి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వయసు మీరిన నేపథ్యంలో కరోనా వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే కారణంతోనే ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్, ఢిల్లీలకు పరిమితమవుతున్నారని కొందరు అంటున్నారు. ఒక వేళ ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గానికి వచ్చారంటే ఎక్కువమంది ఆయనను కలిసేందుకు ప్రయత్నిస్తారని, అప్పుడు వారిని తిరస్కరిస్తే బాధపడతారన్న ఉద్దేశంతోనే రావడం లేదంటున్నారు.

నెల్లూరు పెద్దారెడ్డి రాక కోసం ఎదురుచూపులు:
కరోనా నేపథ్యంలో ఒక పక్క జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం నెలకి ఒకటి రెండు సార్లయినా జిల్లా ప్రజలను పలకరించి వెళ్తుంటే బాగుండేదని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎంపీ ఆదాల కనిపించక పోవడానికి కారణాలు ఎలా ఉన్నప్పటికీ తమ నెల్లూరు పెద్దారెడ్డి నియోజకవర్గంలో ఎప్పుడు పర్యటిస్తారో అని ఆయన అనుచరులు ఎదురు చూస్తూ ఉన్నారట. మరి ఆయన ఇప్పట్లో వస్తారో లేదో.. చూడాలి.