పెళ్లి కావాలా: అందమైన యువతులు.. ఆకర్షణీయమైన మాటలు.. లక్షల్లో

పెళ్లి కావాలా: అందమైన యువతులు.. ఆకర్షణీయమైన మాటలు.. లక్షల్లో

Nellore: బడాబాబులే టార్గెట్‌గా వల వేసిన యువతి.. పెళ్లి పేరు చెప్పి భలేగా సంపాదించింది. తొలి చూపులోనే ఆకట్టుకోవడం, కాంటాక్ట్ నెంబర్ తీసుకుని చాటింగ్, కాలింగ్ లతో దగ్గరవడం, వీలైనంత వరకూ దండుకున్నాక కాంటాక్ట్ కట్ చేయడం అలవాటుగా చేసుకుంది. ఇదే కోవలో మోసాలు చేసుకుంటూ వచ్చి చివరకు ఓ మధ్య తరగతి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు చేసిన దర్యాప్తులో విషయం వెల్లడైంది.

నెల్లూరుకు చెందిన స్వాతి ఎంబీఏ పూర్తి చేసింది. ఆమె భ‌ర్త ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చ‌ర‌ర్‌ గా పనిచేస్తున్నారు. పెద్దింటి అమ్మాయిలా మంచి హోదాలో ఉన్న వ్యక్తిలా మ్యాట్రిమొని వెబ్‌సైట్‌ లలో ప్రొఫైల్స్ క్రియేట్ చేసింది. వాటికి తగ్గ ప్రొఫైల్ ఫొటోస్ అప్ లోడ్ చేసింది. అవి చూసి కాంటాక్ట్ అయిన వాళ్లతో నేర్పుగా చనువు పెంచుకునేది.

అమెరికా నుంచి ఫోన్‌ చేస్తున్నట్లు నమ్మించడానికి వర్చువల్‌ ఫోన్‌ నెంబర్లు వాడేంది. అలా పరిచయం పెంచుకుని, పెళ్లి చేసుకుంటాన‌ంటూ నమ్మించి బుట్ట‌లో వేసుకునేది. పెళ్లి చేసుకుందాం.. ఇండియాకు వ‌స్తున్నానని న‌మ్మించి చిన్న మెలిక పెట్టేది. ఇక పెళ్లి కావడమే ఆలస్యం అనుకున్న సమయంలో ఏదో ఒక అవ‌స‌రాన్ని ముందుంచి డ‌బ్బులు కావాలని అడిగేది.

ఆర్థికంగా చిన్న సమస్య వచ్చిందని, కొంత డబ్బు అడ్జెస్ట్ చేయాలని కోరేది. అవి అందుకోగానే ఆ వ్యక్తితో సంబంధాల‌ు క‌ట్ చేసుకునేది. ఆమె మాయ మాట‌లు న‌మ్మి మోస‌పోయిన ఓ కుటుంబం రూ.5లక్షలు పోగొట్టుకున్నామంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసుల విచార‌ణ‌లో స్వాతి నేరాలు బ‌య‌ట‌ప‌డటంతో పోలీసులు అరెస్టు చేశారు.