అమ్మాయిలను ఎరవేసి ఆన్ లైన్ లో డబ్బులు కాజేస్తున్న వ్యక్తి అరెస్ట్

  • Published By: murthy ,Published On : August 15, 2020 / 02:58 PM IST
అమ్మాయిలను ఎరవేసి ఆన్ లైన్ లో డబ్బులు కాజేస్తున్న వ్యక్తి అరెస్ట్

కరోనా లాక్ డౌన్ టైమ్ లో ఉన్నఉద్యోగాలు ఊడి కొందరు బాధపడుతుంటే ఉద్యోగానికి ఆఫీసుకు వెళ్లకుండా వర్క్ ఫ్రం హోంచేస్తూ మిగిలిన ఖాళీ టైమ్ ఎలా గడపాలా అనుకున్నవాళ్లు కొందరు…..అలాగే కాలేజీలు లేక విద్యార్దులు టైంపాస్ కోసం సోషల్ మీడియాను ఆశ్రయించారు.



ఇలాంటి వారి నుంచి అడ్డగోలుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో మోసగాళ్లు తెగించారు. మహిళలను ఎరగావేసి డేటింగ్ యాప్ తయారు చేసి డబ్బులు కాజేశారు. ఉత్తరాంధ్రలోని విజయనగరానికి చెందిన ఒక వ్యక్తి ఈ విష సంస్కృతికి జిల్లాలో తెరలేపాడు.

ఆన్ లైన్ లో అమ్మాయిలతో చాటింగ్ లు, డేటింగ్ లు చేసేందుకు ఆన్ లైన్ పోర్టల్ లో ఖాతా తెరిచాడు. ఈ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్లో అమ్మాయిల ఫొటోలు ఎరవేసి, వారితో చాటింగ్‌ చేయడానికి, డేటింగ్‌కు నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా వారితో మాట్లాడించి, డబ్బులు అకౌంట్‌లో వేయించుకోవడం, డబ్బులు ఖాతాలో పడిపోగానే సెల్‌ స్విచ్చాఫ్‌ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఇప్పటికే ఇలా చాలా మందిని మోసం చేశాడు.



జిల్లాకు చెందిన ఎన్‌ఆర్‌ఐ నరేష్‌ ఇటీవల ఈమోసగాడి వలలో చిక్కుకుని…. చాటింగ్‌ చేస్తూ తన ఖాతా నుంచి రూ. 8,500 వేయడానికి ఒప్పందం కుదుర్చుకుని, ఆ తర్వాత పొరపాటున రూ. 85 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేసేశాడు. బ్యాలెన్స్ చూసుకోగా జరిగిన తప్పు తెలుసుకుని తన ఖాతాలోకి తిరిగి డబ్బులు పంపించాలని వేడుకున్నా, ఫలితం లేక పోయింది.

డేటింగ్‌ సైట్‌ నిర్వాహకుడు సెల్‌ స్విచ్చాఫ్‌ చేసేశాడు. దిక్కు తోచని స్థితిలో ఆ బాధితుడు జిల్లా ఎస్పీ బి.రాజకుమారికి ఆగస్టు 11న ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఆదేశాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విజయనగరంలోని రింగురోడ్డు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆన్‌ లైన్‌ డేటింగ్‌ నడుపుతున్నట్లు గుర్తించారు. విచారణ చేయగా మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.



ఆన్ లైన్ గేమ్స్ ఆడుతున్నప్పుడు, వీడియోలు చూస్తున్నప్పుడు సోషల్ మీడియాలో “లోకోంటో” పేరుతో డేటింగ్ వెబ్ సైట్ యాడ్ లు వస్తుంటాయి. అందులో అబ్బాయిలు, అమ్మాయిలు పరిచయాలు పెంచుకోవటం, శృంగార కార్యకలాపాలకు తావివ్వటం, వ్యభిచారం ప్రోత్సహించటం చేసేవాడు.

ఈ వెబ్ సైట్ నిర్వహిస్తున్నవ్యక్తి జార్ఖండ్ రాష్ట్రం నుంచి విజయనగరం వచ్చి స్దిరపడిన కుమార్ గా గుర్తించారు. అతను రింగురోడ్డు సమీపంలో నివాసం ఉంటూ రామనారాయణంప్రాజెక్టు సమీపంలో ఒక ఆలయాన్ని నిర్నించి సొసైటీలో పెద్ద మనిషిగా చలామణీ అవుతున్నాడు.



అతనికి ఇద్దరు భార్యలు. అందులో రెండో భార్య ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు సహకరిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. ఇంతవరకు వీరి చేతిలో ఎంత మంది బాధితులు ఆన్ లైన్ లో మోసపోయారు అనే లెక్క తేల్చే పనిలో ఉన్నారు.

కాగా…. కుమార్ కు ఉన్న పలుకుబడి ద్వ్రారా కేసును నీరు గారుస్తున్నరనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలను జిల్లా ఎస్పీ ఖండించారు. కేసు దర్యాప్తు దశలో ఉందని త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.