చిన్నారి మృతదేహాన్ని మూడు కిలోమీటర్లు చేతుల మీద తీసుకెళ్లారు

  • Published By: bheemraj ,Published On : August 15, 2020 / 05:52 PM IST
చిన్నారి మృతదేహాన్ని మూడు కిలోమీటర్లు చేతుల మీద తీసుకెళ్లారు

విశాఖ ఏజెన్సీలో హృదయ విధారకర సంఘటన చోటు చేసుకుంది. బ్రిడ్జీ సరిగ్గా లేకపోవడంతో చిన్నారి మృతదేహాన్ని చేతులపై ఎత్తుకుని తల్లిదండ్రులు మూడు కిలో మీటర్లు నడిచారు. విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం కితలంగి పంచాయతీ వయ్యా గ్రామానికి చెందిన బాబురావు కుమార్తె ఎలీశా అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స కోసం నాలుగు రోజుల క్రితం అరకు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎలీశా ఆరోగ్యం విషమించి ఆస్పత్రిలో నిన్న మధ్యాహ్నం మరణించింది.



తల్లిదండ్రులు పాప మృతదేహాన్ని తీసుకుని అంబులెన్స్ లో బయలుదేరారు. అయితే కిమ్స్ మండ సంత జంక్షన్ నుంచి కింతలంగి పంచాయతీకి వెళ్లాలంటే బ్రిడ్జీ దాటాలి. 2014 లో వచ్చిన హుదూద్ తుపాన్ వల్ల ఆ బ్రిడ్జీ కూలి పోయింది. దీంతో అంబులెన్స్ సిబ్బంది మృతదేహాన్ని బ్రిడ్జీ వద్దనే దించేశారు. దీంతో తల్లిదండ్రులు బాబురావు, అతని భార్య.. చిన్నారి మృతదేహాన్ని చేతుల మీద తీసుకొని మూడు కిలో మీటర్లు నడిచి తమ గ్రామానికి చేరుకున్నారు.



వర్షాకాలంలో బ్రిడ్జీ సరిగ్గా లేనందున గిరిజనులు రవాణాకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిసుమండ పంచాయతీలోని రెండు గ్రామాలు, కితలంగి పంచాయతీ పరిధిలోని ముప్పై గ్రామాల ప్రజలు 15 నుంచి 20 మీటర్లు నడిచి కిసుమండకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. బ్రిడ్జీ నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.