నాక్కొంచెం తిక్కుంది.. కానీ.. దానికో లెక్కుంది

  • Published By: madhu ,Published On : January 16, 2020 / 12:46 AM IST
నాక్కొంచెం తిక్కుంది.. కానీ.. దానికో లెక్కుంది

నాక్కొంచెం తిక్కుంది.. కానీ.. దానికో లెక్కుంది.. ఇది గబ్బర్‌సింగ్‌ సినిమాలో పవన్‌ చెప్పిన డైలాగ్‌. ఇప్పుడు రాజకీయాల్లోనూ ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీని కాదని వామపక్ష పార్టీలతో దోస్తీ కట్టి బొక్కబోర్లా పడ్డ పవన్‌… తాజాగా కమలానికి దగ్గరవడం వెనక కారణమేంటి? లెఫ్ట్‌ పార్టీలకు హ్యాండ్‌ ఇవ్వబోతున్నారా? ఒకవేళ బీజేపీతో పొత్తుపై పవన్‌ క్లారిటీ ఇస్తే.. వామపక్షాల రియాక్షన్‌ ఎలా ఉంటుంది?

 

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు.. ఇది పవన్‌ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో డైలాగ్‌. ఇప్పుడు రాజకీయాల్లోనూ ఈ ఫార్ములానే అమలు చేస్తున్నారు జనసేనాని. 2014లో టీడీపీకి సపోర్టు చేసిన పవన్.. 2019 ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, బీఎస్పీతో పొత్తు పెట్టుకొని ఒక్క సీటుకే పరిమతమయ్యారు. అనంతరం వామపక్ష నేతలకు దూరమవుతూ వచ్చారు. గతంలో ప్రత్యేకహోదాపై కేంద్రాన్ని నిలదీసిన పవన్‌.. హఠాత్తుగా కమలం పాట పాడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

 

వైసీపీ ప్రభుత్వంపై ఉద్యమాలకు పవన్…బీజేపీని వాడుకోవాలనుకుంటున్నారా..? లేక నిజంగానే బీజేపీతో కలసి నడవాలన్న కోరికతో ఉన్నారా అన్న విషయంపై కమలం పార్టీలో చర్చ సాగుతోంది. మరోవైపు వామపక్షాలతో చర్చించకుండా పవన్‌ ఢిల్లీ వెళ్లి బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డాతో భేటీ కావడంతో లెఫ్ట్‌ పార్టీల నేతలు షాక్‌కు గురయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా పవన్ వామపక్షాలతో ప్రయాణం చేశారు. అయితే ఆ తర్వాత నెమ్మదిగా వారికి దూరమయ్యారు. అయినా పవన్‌ ఇంత హఠాత్తుగా బీజేపీ వైపు వెళతారని వామపక్ష నేతలు ఊహించలేదు.

అయితే గురువారం జనసేన, బీజేపీ సమావేశం తర్వాత పవన్‌ ప్రకటన చూసి తమ కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు వామపక్ష నేతలు. కానీ.. పవన్ మాత్రం బీజేపీతో పొత్తుకే మొగ్గు చూపుతుండడంతో.. ఇక వామపక్షాలను పక్కన పెట్టినట్టేనని ఆ పార్టీలోనే గుసగుసలు వినబడుతున్నాయి. కొంతకాలంగా వామపక్ష నేతలను పవన్‌ దగ్గరకు రానీయకపోవడానికి కారణం కూడా.

బీజేపీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశమేనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పవన్ తాజా నిర్ణయంతో షాక్‌లో ఉన్న కమ్యూనిస్టులు జనసేనపై గుర్రుగా ఉన్నారు. గురువారం నిర్వహించనున్న కీలక భేటీ.. సమస్యలపై ఉద్యమాలకా లేక పొత్తులపై చర్చకా అన్నది నిశితంగా పరిశీలిస్తున్నారు వామపక్ష నేతలు. 

Read More : కమల పవనాలు : బీజేపీ – జనసేన కలిస్తే..రాజకీయం మారుతుందా