ఎస్ఈసీ నిమ్మగడ్డ పర్యటనలు..ఎక్కడెక్కడ ?

ఎస్ఈసీ నిమ్మగడ్డ పర్యటనలు..ఎక్కడెక్కడ ?

sec nimmagadda : ఏపీ ఎన్నికల కమిషనర్ లేఖాస్త్రాలు, జిల్లాల పర్యటనలు కొనసాగుతున్నాయి. పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులను ఎన్నికల కమిషన్‌ ఎదుట హాజరుకావాలని లేఖలో ఆదేశించారు. రెండు జిల్లాలకు కలెక్టర్లను సిఫారసు చేస్తూ సీఎస్‌కు మరో లేఖ రాశారు. అటు ప్రవీణ్‌ప్రకాష్‌ను తప్పించాల్సిన అవసరం లేదంటూ ఎస్‌ఈసీకి సీఎస్‌ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జిల్లాల పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్‌ఈసీ 2021, ఫిబ్రవరి 02వ తేదీ, 03వ తేదీ ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు, పోలీసులకు పలు సూచనలు చేయనున్నారు. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తారు. ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

తొలి విడత పంచాయతీ పోరుకు ఆన్‌లైన్‌లో నామినేషన్లను స్వీకరించలేదు. దీంతో ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ లేఖ రాశారు. ఆన్‌లైన్‌లో నామినేషన్లు స్వీకరించకపోవడాన్ని లేఖలో ప్రస్తావించారు. నామినేషన్లను ఆన్‌లైన్‌లోనూ స్వీకరించాలని పలు రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేశాయి. దీంతో ఆన్‌లైన్‌లో స్వీకరించాలని ఆదేశించినా… ఎందుకు స్వీకరించడం లేదో చెప్పాలంటూ పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ద్వివేదీ, కమిషనర్‌ గిరిజా శంకర్‌ను ప్రశ్నించారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ. సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ముందు హాజరుకావాలని ఇద్దరినీ ఆదేశించారు.

రెండు జిల్లాలకు కలెక్టర్లను సిఫారసు చేస్తూ ఏపీ సీఎస్‌ ఆదిత్యనాధ్‌ దాస్‌కు ఓ లేఖ రాశారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌. చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లుగా ఎం.హరినారాయణ్, బసంత్ కుమార్‌ను సిఫారసు చేశారు. ఇద్దరినీ కూడా కలెక్టర్లుగా నియమించాలని ప్రతిపాదించారు. ప్రభుత్వం పంపిన ప్యానల్‌లో ఇద్దరిని సెలక్ట్ చేసిన ఎస్ఈసీ.. లిస్ట్‌లో ఉన్న మరో ఇద్దరిని రిజక్ట్‌ చేశారు. హెచ్‌ అరుణ్‌కుమార్‌, వివేక్‌ యాదవ్‌లు తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల అబ్జర్వర్లుగా ప్రతిభ కనబరుస్తున్నారని.. వారిద్దరి గత అనుభవాలు ఎన్నికల నిర్వహణకు సరిపోవంటూ తిరస్కరించారు.

మరోవైపు ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ లేఖ రాశారు. సాధారణ పరిపాలనా విభాగం జీఏడీ-పొలిటికల్‌ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ విషయంలో ఎస్‌ఈసీ లేవనెత్తిన అంశాలపై తన లేఖలో సమాధానం ఇచ్చారు. ప్రవీణ్‌ ప్రకాష్‌ జీఏడీలో ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్నారని.. ఆయన కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ పరిధిలోకి రాబోరని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తనకు లేఖలో రాసిన అంశాలను మరోసారి పునఃపరిశీలించాలని కోరారు. కోడ్‌ ఆఫ్ కాండక్ట్‌ పరిధిలోకి రానందున.. ప్రవీణ్‌ ప్రకాష్‌పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని తన లేఖలో స్పష్టం చేశారు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌. మొత్తంగా ఎస్‌ఈసీ లేఖాస్త్రాలు, ప్రభుత్వం నుంచి తిరుగుటపాలు..రాష్ట్ర రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.