Temple to Mother : రూ.10 కోట్ల ఖర్చుతో..పంచగోపురాలతో అమ్మకు గుడి కట్టిస్తున్న కొడుకు

రూ.10 కోట్ల ఖర్చుతో..కృష్ణ శిలలతో.. పంచగోపురాలతో అమ్మకు గుడి కట్టిస్తున్నాడు ఓ కొడుకు.

Temple to Mother : రూ.10 కోట్ల ఖర్చుతో..పంచగోపురాలతో అమ్మకు గుడి కట్టిస్తున్న కొడుకు

Temple To Mother In Srikakulam Ap

Temple to Mother In srikakulam Ap :  సృష్టికి మూలం అమ్మ..! తెలుగు అక్షరాల్లో ఆది అక్షరం అమ్మ. భాషకు అందని భావం అమ్మ. ఈ భూమండలంపై స్వచ్ఛమైన ప్రేమ అమ్మ దగ్గర మాత్రమే దొరకుతుంది. అలాంటి తల్లి గురించి ఎంత చెప్పినా.. ఏం చెప్పినా తక్కువే ! ఆమెకు ఎంత చేసినా.. ఏం చేసినా.. ఆ రుణానుబంధం మాత్రం తీరిపోదు. అలాంటి తల్లులకు గుండెల్లో గుడి కట్టే పిల్లల్ని ఇప్పటి వరకు మన చూసే ఉంటాం. కానీ ఓ కొడుకు తన తల్లికోసం నిజంగానే దేవాలయం నిర్మిస్తున్నాడు. అది కూడా అలాంటి ఇలాంటి ఆలయం కాదు..

కొందరు తమకు ఎప్పుడూ తల్లిదండ్రులు కనిపిస్తూనే ఉండాలని.. వాలెట్‌లో ఫోటోలు పెట్టుకుంటారు. మరికొందరు భౌతికంగా దూరమైన పేరెంట్స్‌కి విగ్రహాలే కట్టేస్తుంటారు. కానీ ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి అంతకుమించి. ఏకంగా తన తల్లికోసం ఒక ఆలయాన్నే నిర్మించేస్తున్నాడు. ఈ సృష్టిలో తల్లిని మించిన దైవం లేదని అంటారు. అందుకే తల్లికోసం గుడినే కడుతున్నాడు శ్రవణ్‌ కుమార్.

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం చీమలవలస గ్రామమే సొంతూరు. శ్రవణ్‌కు తన తల్లి అంటే మాటల్లో చెప్పలేనంత ప్రేమ. అనసూయదేవికి చేసిన శస్త్రచికిత్స వికటించడంతో ఆమె 2008లో ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు శ్రవణ్‌ మనిషి కాలేకపోయాడు. తల్లి జ్ఞాపకాలతోనే హైదరాబాద్‌ చేరుకుని రియల్ ఎస్టేట్‌ వ్యాపారంలో బాగా స్థిరపడ్డాడు. ఆ తర్వాత తన సొంత గ్రామంలో తల్లికి దేవాలయం కట్టాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఆలయం పనులు మొదలు పెట్టాడు. ఇప్పుడది దాదాపుగా పూర్తయ్యే దశకు చేరుకుంటోంది.

దీనికి అమ్మ దేవస్థానం అని పేరు పెట్టారు. ఇది కేవలం తన తల్లికి నిర్మిస్తున్న ఆలయం మాత్రమే కాదని… తల్లిని దైవంలా చూడలనే ఆలోచన అందరిలో కలిగించేందుకు ఈ పని చేస్తున్నానని శ్రవణ్‌ చెబుతున్నాడు. ఈ ఆలయాన్ని చూసి అందరూ స్ఫూర్తి పొందాలన్నదే తన ఉద్దేశమంటున్నాడు. అమ్మ అనే పదంలో ఆప్యాయత, అనురాగం, ఆత్మీయత గురించి ఎంత చెప్పినా తక్కువే.. మాటలకు అందని అమ్మ ప్రేమకు తానిచ్చే చిన్న బహుమతి ఈ దేవాలయమని శ్రవణ్‌ చెబుతున్నాడు.
అమ్మకు ఆలయమంటే సాదాసీదాగా కాదు. ఏకంగా ఈ దేవాలయం కోసం శ్రవణ్‌ 10 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. అత్యద్భుతంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నాడు. ఆలయం దశాబ్దాల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మిస్తున్నాడు. ఆలయ నిర్మాణంలో ఎక్కడా ఇటుకలను వినియోగించడం లేదు.

పూర్తిగా గుంటూరు నుంచి తీసుకొచ్చిన కృష్ణ శిలలతో 51 అడుగుల ఎత్తులో పంచగోపురాలతో నిర్మాణం జరుగుతోంది. అంతేకాదు కృష్ణశిలలను ఒకదానికొకటి అతికించడానికి కూడా సిమెంట్ వాడడం లేదు. దీనికోసం పురాతన నిర్మాణాల్లో వాడే రాయి బంధన మిశ్రమాన్ని వినియోగిస్తున్నారు. తుమ్మబంకను తమిళనాడు నుంచి, శ్రీశైలం నుండి కొబ్బరి పీచు, తాడేపల్లిగూడెం నుంచి సున్నం తీసుకొచ్చి రాయి బంధన మిశ్రమం తయారు చేస్తున్నారు. ఇలా చేస్తే దశాబ్దాల పాటు ఆలయం చెక్కు చెదరకుండా ధృడంగా ఉంటుంది.

అమ్మ దేవస్థానాన్ని ఆగమశాస్త్ర నియమాల ప్రకారం నిర్మిస్తున్నారు. తమిళనాడు నుంచి శిల్పులు, ఒడిశా నుంచి శిల్పకళలో నిష్టాతులైన వారిని తీసుకొచ్చి అత్యద్భుత శిల్పాలు చెక్కిస్తున్నారు. మొత్తంగా శ్రవణ్‌ కుమార్‌కు అమ్మపై ప్రేమకు అంతా సలామ్ చేస్తున్నారు.