పాతమిత్రులు కొత్త చెలిమి : ఏపీలో కలిసి నడుద్దాం 

  • Published By: madhu ,Published On : January 16, 2020 / 08:09 AM IST
పాతమిత్రులు కొత్త చెలిమి : ఏపీలో కలిసి నడుద్దాం 

పాత మిత్రుల మధ్య కొత్త చెలిమి చిగురిస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏకం కావాలని డిసైడ్ అవుతున్నారు జనసేన, బీజేపీ పార్టీలు. కలిసి పనిచేయాలని ఇరు పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి కోసం చేసే ఉద్యమాలు, ఆందోళనలు, ఎన్నికల వరకు అంశాల వారీగా అవగాహనతో ముందుకు వెళ్లాలని నిశ్చయించాయి.

2020, జనవరి 16వ తేదీ గురువారం హోటల్ మురళీ ఫార్చ్యూన్‌లో ఇరు పార్టీలకు చెందిన నేతలు భేటీ అయ్యారు. బీజేపీ నుంచి సునీల్ దియోధర్, కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్, పురంధేశ్వరీ, సోము వీర్రాజు హాజరు కాగా..జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌లు హాజరయ్యారు. సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. మీటింగ్ ముగిసిన అనంతరం ఇరు పార్టీలకు చెందిన నేతలు మీడియా సమావేశంలో మాట్లాడుతారు. 

రెండు పార్టీలు కూడా… రాజధాని అమరావతి అంశంపై ఉమ్మడి పోరు గురించి చర్చిస్తున్నట్లు సమాచారం. రాజధాని తరలింపును రెండు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ అమరావతినే రాజధానిగా ఉంచాలనే తీర్మానం చేసింది. జనసేన కూడా ఒకేచోట నుంచి పాలన… అభివృద్ధి వికేంద్రీకరణ అని తీర్మానించింది. దీంతో రెండు పార్టీల పొత్తుపై సమావేశం తర్వాత క్లారిటీ రానుంది. 

పవన్  ఢిలీ పర్యటన
అంతకుముందు…జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ బీజేపీకి చెందిన కీలక నేతలను కలిశారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డాతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పని చేయాలని డిసైడ్ అయ్యారు. అవసరాన్ని బట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

స్వరం మార్చిన పవన్
ఢిల్లీ పర్యటన అనంతరం కాకినాడలో పర్యటించిన సమయంలో పవన్‌… ఒక్కసారిగా స్వరం మార్చారు. కేంద్రంతీరుపై సానుకూలంగా స్పందించారు. అమరావతిలో జరుగుతున్న ఆందోళనలు, మహిళలపై దాడులను కేంద్రానికి వివరించానన్నారు. ఏ ఆశయాలతోనైతే ప్రధాని ముందుకెళ్తున్నారో… ఆ ఆశయాలు ఏపీలో కనిపించట్లేదన్నారు పవన్‌. 
రాజధాని అమరావతిపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇవి 2020, జనవరి 16వ తేదీ గురువారానికి 30 రోజుకు చేరుకున్నాయి. ఆందోళనల్లో బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

మూడు ప్రాంతాల్లో రాజధాని 
రాజధానిని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ చేసిన ప్రకటన చిచ్చు రేపిన సంగతి తెలిసిందే. అమరావతి ప్రాంత రైతులు 33 వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. వీరంతా కుటుంబసమేతంగా ఆందోనల్లో పాల్గొంటున్నారు. దాదాపు 46 సంఘాలు కలిసి ఏర్పడి అమరావతి రాజధాని కోసం చేసే పోరాటాన్ని తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. దీన్ని చంద్రబాబు నాయకత్వం వహించే స్థాయికి తీసుకొచ్చారు.

సేవ్ అమరావతి..టీడీపీకి మంచి మైలేజీ
సేవ్ అమరావతి పేరిట చేసే పోరాటాలు టీడీపీకి మంచి మైలేజీ తీసుకొస్తున్నాయి. ఈ విషయంలో జనసేన వెనుకబడిపోయింది. దీంతో బీజేపీతో కలసి అమరావతి పరిరక్షణ కోసం ఉద్యమిస్తే బాగుంటుందనే నిర్ణయానికి పవన్ వచ్చారు. ఫలితంగానే బీజెపీతో చెలిమికి మళ్లీ పవన్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి బీజేపీ – జనసేన భేటీలో ఎలాంటి నిర్ణయం వెలువడనుందో చూడాలి. 

Read More : రంగంపేటలో జల్లికట్టు : మోహన్ బాబు, మంచు మనోజ్ స్పెషల్ అట్రాక్షన్