అయ్యన్న దూకుడు.. సొంత పార్టీ నేతలపైనే నిప్పులు, అధికారం కోసం పార్టీలు మారితే పత్తా లేకుండా పోతారని ఆగ్రహం

  • Published By: naveen ,Published On : September 28, 2020 / 02:58 PM IST
అయ్యన్న దూకుడు.. సొంత పార్టీ నేతలపైనే నిప్పులు, అధికారం కోసం పార్టీలు మారితే పత్తా లేకుండా పోతారని ఆగ్రహం

Chintakayala Ayyanna Patrudu.. తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు జోరు పెంచారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీకి దిశానిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల్లో పరాజయం పాలైనా నిత్యం ప్రభుత్వంపై వీడియోలు రిలీజ్ చేస్తూ ప్రజల మధ్య ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం టీడీపీ సీనియర్లు, పొలిట్‌బ్యూరో సభ్యులతో పార్టీ అధిష్టానం వీడియో కాన్షరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు ఎదుటే అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన కొందరు నాయకులు ఏమయ్యారని అయ్యన్నపాత్రుడు గట్టిగా నిలదీశారట. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంమైంది.

ఎందుకు బయటికి రావడం లేదు? ఎవరికి భయపడుతున్నారు?
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరికో భయపడి పదవులు అనుభవించిన నేతలు దాక్కుంటున్నారని అయ్యన్నపాత్రుడు నిప్పులు చెరిగారట. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాసమస్యలు, అధికార పార్టీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడటం అవసరమన్నారట.

టీడీపీలో మంత్రులుగా పని చేసిన వారు, వివిధ పదవులు అనుభవించిన వారు ఇప్పుడు ఏమయ్యారని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించినట్లు సమాచారం. వారెందుకు బయటికి రావడంలేదు? ఎవరికి భయపడుతున్నారు? లాంటి ప్రశ్నలు సంధించారట. మరికొందరు నేతలు అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారని ఆక్రోశం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

అయ్యన్న వ్యాఖ్యలకు విశాఖ టీడీపీ రాజకీయాలకు సంబంధం:
అయ్యన్న వ్యాఖ్యలకు విశాఖ టీడీపీ రాజకీయాలకు సంబంధం ఉందని అంటున్నారు. విశాఖ నగరం నుంచి టీడీపీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేశ్‌కుమార్, గణబాబు యాక్టివ్‌గా లేరు.

వాసుపల్లి గణేశ్‌ ఇటీవలే తన కుమారులను జగన్‌ సమక్షంలో వైసీపీలో చేర్చారు. తాను కూడా వైసీపీకి మద్దతిస్తున్నానని ప్రకటించారు. కరోనా ఉన్నందు వల్ల నేతలు యాక్టివ్‌గా లేరనుకోవడానికి లేదు. ఇటీవల కాలంలో గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతారన్న ప్రచారం సాగుతోంది. ఆయన అధికార పార్టీలో తొందరలోనే చేరతారని అనుచరులే అంటున్నారు.

జంపింగ్‌కు సిద్ధంగా ఉన్న గంటా లాంటి నేతలను ఉద్దేశించేనా:
ఇదే సమయంలో టీడీపీ విశాఖ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ టీడీపీ అధిష్టానానికి ఝలక్ ఇచ్చారు. పార్టీ పెద్దలు ఎవరూ బయటకు రాకున్నా గణేశ్‌ మాత్రం పార్టీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాలను తన నియోజకవర్గంలో చేపట్టేవారు. అలాంటిది ఆయన సడన్‌గా ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా పార్టీకి షాకిచ్చారు.

ఇదే సమయంలో అయ్యన్న మరోసారి క్లారిటీ ఇచ్చారు. అధికారం కోసం పార్టీలు మారిన నేతలను తెలుగుదేశం పార్టీ ఎంతోమందిని చూసిందని, వారంతా పత్తా లేకుండా పోయారని గట్టిగానే చెప్పారు. జంపింగ్‌కు సిద్ధంగా ఉన్న గంటా లాంటి నేతలను ఉద్దేశించే అయ్యన్న ఈ వ్యాఖ్యలు చేశారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.