Nara Lokesh : వైఎస్ జగన్ కు సెల్ఫీ చాలెంజ్ విసిరిన నారా లోకేశ్.. జగన్ ఎలా స్పందిస్తారో..
కియా పరిశ్రమ ముందు ఏపీ సీఎం జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ సెల్ఫీ చాలెంజ్ చేశారు. ఒక్క కియా పరిశ్రమతో 25 వేల కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చాయన్నది అబద్ధమని జగన్మోహన్ రెడ్డి చెప్పగలడా? అని ప్రశ్నించారు.

Nara Lokesh (1)
Nara Lokesh : కియా పరిశ్రమ ముందు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ సెల్ఫీ చాలెంజ్ చేశారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కియా పరిశ్రమ వద్ద 700 కిలోమీటర్ల మైలురాయి దాటింది. ఇది చంద్రబాబు ఘనత.. అంటూ నారా లోకేష్ కియా పరిశ్రమను చూపించారు. ఈ సంద్భంగా లోకేశ్ మాట్లాడుతూ ఒక్క కియా పరిశ్రమతో 25 వేల కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చాయన్నది అబద్ధమని జగన్మోహన్ రెడ్డి చెప్పగలడా? అని ప్రశ్నించారు.
పరోక్షంగా లక్షలాది మందికి కియా ద్వారా లబ్ధి చేకూరలేదా? అని నిలదీశారు. అధికారంలో ఉండగా చేసిన అభివృద్ధి చెప్పుకోవటంలో విఫలమయ్యామని చెప్పారు. పాదయాత్రలో తాము తెచ్చిన వందలాది పరిశ్రమల ముందు సెల్ఫీ దిగి ఛాలెంజ్ చేస్తున్నామని తెలిపారు. 4 ఏళ్లలో తాను తెచ్చిన ఒక్క పరిశ్రమ ముందైనా జగన్మోహన్ రెడ్డి సెల్ఫీ దిగి చూపగలరా? అని సవాల్ చేశారు.
CM Jagan-Nara Lokesh : వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ‘ఆ మూడు పాయింట్ల’తోనే.. నారా లోకేశ్ సెటైర్లు
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వేలాది పరిశ్రమల ద్వారా 6లక్షల ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ ప్రభుత్వమే అసెంబ్లీలో ఒప్పుకుంది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఒక్క కియా అనే కాదు, ఉమ్మడి అనంతపురం జిల్లాను తయారీ రంగం హబ్ గా అభివృద్ధి చేయాలని చంద్రబాబు సంకల్పించారని వెల్లడించారు.
అందుకనుగుణంగానే ప్రతీ జిల్లాకు అభివృద్ధి ప్రణాళిక విజన్ రూపొందించారని పేర్కొన్నారు. అభివృద్ధిలో ఏపీ దేశంలో నెంబర్1 గా ఎందుకు ఉండకూడదనే సంకల్పంతో తాము పని చేశామని చెప్పారు. ఇప్పుడు అరాచకాల్లో ఏపీని నెంబర్1 చేసేందుకు వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఎద్దేవా చేశారు. నారా లోకేశ్ విసిరిన సెల్ఫీ చాలెంజ్ పై సీఎం జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
కాగా, వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపై ట్విటర్ లో నారా లోకేశ్ వ్యంగ్యంగా స్పందించారు. జగన్ ఢిల్లీ టూర్లపై ప్రజలకు క్విజ్ పోటీ నిర్వహించారు.
జగన్ ఢిల్లీటూర్ల పై ప్రజలకు క్విజ్ పోటీ
1) జగన్ ఢిల్లీ టూర్ ఇది ఎన్నోసారి?
2) ఇప్పటి వరకూ రాష్ట్రానికి ఏం సాధించారు?
3) ప్రత్యేక విమానానికి ఎన్ని కోట్లు ఖర్చు?#JaganVisitsDelhiForCases pic.twitter.com/PFOBFWtDLv
— Lokesh Nara (@naralokesh) March 29, 2023