టీడీపీ తరపున నామినేషన్.. వైసీపీలోకి జంప్!

టీడీపీ తరపున నామినేషన్.. వైసీపీలోకి జంప్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ పార్టీల మధ్య మున్సిపల్ పోల్స్ యుద్ధ వాతావరణం సృష్టిస్తొన్నాయి. మున్సిపల్ ఎన్నికలకు ముందు శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీకి షాక్ తగిలింది. పార్టీ తరపున నామినేషన్ వేసిన నలుగురు అభ్యర్ధులు వైసీసీలోకి జంప్‌ అయ్యారు. మంత్రి సీదిరి అప్పలరాజు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.

20వ వార్డు తరపున నామినేషన్ వేసిన బమ్మిడి వెంకటలక్ష్మి, 29వ వార్డులో నామినేషన్ వేసిన హరి, నాలుగో వార్డులో నామినేషన్ వేసిన వాయలపల్లి లక్ష్మణరావు, 8వ వార్డులో నామినేషన్ వేసిన మురళీ కృష్ణ నిన్న సాయంత్రం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. రోనంకి మురళీ కృష్ణను వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారని ఆయన సోదరుడు ఆరోపించారు. కాసేపటికే మురళీ కృష్ణ వైసీసీ కండువాతో కనిపించడం స్థానికంగా చర్చనీయాశం అయ్యింది. డమ్మీ నామినేషన్లు వేసిన వారు కూడా పోటీకి ఆసక్తి చూపకపోవడంతో టీడీపీ నేతలకు ఏం చేయాలో అర్ధం కావట్లేదు.

అంతుకుముందు విశాఖలోనూ పలువురు టీడీపీ అభ్యర్థులను వైసీపీలో చేర్చుకున్న నేతలు మున్సిపోల్స్‌ ప్రచారంలో దూకుడు పెంచారు. 49 వ వార్డు, 8, 54వ వార్డుల్లో రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి క్యాంపెయిన్ చేశారు. జీవీఎంసీ అభ్యర్ధుల గెలుపు కోసం కార్యకర్తలంతా చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు విజయసాయిరెడ్డి. 54వ వార్డులో స్థానిక సమస్యలను ప్రజలు.. విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఎన్నికలు ముగియగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు

అటు విజయవాడలోనూ మంత్రి వెల్లంపల్లి ప్రచారం ముమ్మరం చేశారు. నగర అభివృద్ధికి వైసీపీ కట్టుబడి ఉందన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.