TDP : యడ్లపాటి వెంకట్రావు కన్నుమూత.. బాబు, టీడీపీ నేతల సంతాపం

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన కుమార్తె నివాసంలో తుదిశ్వాస విడిచారు.

TDP : యడ్లపాటి వెంకట్రావు కన్నుమూత.. బాబు, టీడీపీ నేతల సంతాపం

Yadlapati

TDP Senior Leader Yadlapati Venkatarao : టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన కుమార్తె నివాసంలో తుదిశ్వాస విడిచారు. 103 ఏళ్ల వెంకట్రావు కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. యడ్లపాటి మాజీ మంత్రిగాను, సంఘం డైరీ వ్యవస్థాపుకులుగా, గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్‌, రాజ్యసభ్య సభ్యునిగా పనిచేశారు. యడ్లపాటి వెంకట్రావు 1919 డిసెంబర్‌ 16న గుంటూరు జిల్లా బోడపాడులో జన్మించారు. ఆయన ప్రముఖ రైతు ఎన్‌.జి.రంగా ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. ఎన్‌.జి. రంగాతో కలిసి 1951లో కృషీకార్‌ లోక్‌ పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు.

Read More : Chandrababu: యుక్రెయిన్‌లో తెలుగు విద్యార్థుల వివరాలు కేంద్రమంత్రికి ఇచ్చిన చంద్రబాబు

ఆ తర్వాత 1959లో రంగా, రాజగోపాలచారితో కలిసి స్థాపించిన స్వతంత్ర పార్టీలో చేరారు. 1967లో గుంటూరు జిల్లా వేమూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978లో కాంగ్రెస్‌ చేరారు. అదే సంవత్సరంలో వేమూరు నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. 1978-80 మధ్యకాలంలో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1983లో వెంకట్రావు టీడీపీలో చేరారు. 1995లో గుంటూరు జడ్పీ ఛైర్మన్‌గా సేవలందించారు. 1998లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004లో పదవీకాలం ముగిసిన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. యడ్లపాటి వెంకట్రావు భార్య, కుమారుడు ఇటీవలే మృతి చెందారు. అప్పటి నుంచి ఆయన హైదరాబాద్‌లోని తన కూతురు నివాసంలో ఉంటున్నారు. మధ్యాహ్నం యడ్లపాటి మృతదేహాన్ని గుంటూరు జిల్లా తెనాలిలోని ఆయన నివాసానికి తరలించనున్నారు.

Read More : BheemlaNayak: వ్యక్తి కోసం వ్యవస్థను వదలట్లేదు.. భీమ్లా నాయక్‌పై చంద్రబాబు రియాక్షన్!

యడ్లపాటి మృతిపై టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆయన భౌతికకాయానికి బాబు, టీడీపీ నేతలు నివాళులర్పించారు. రాజకీయ కురువృద్ధులు యడ్లపాటి వెంకట్రావు గారి మృతి బాధాకరమన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన వెంకట్రావు గారి రాజకీయ జీవితం ఎంతో ఆదర్శ ప్రాయంగా సాగిందని తెలిపారు. రాష్ట్ర మంత్రిగా, జడ్పీ చైర్మన్ గా, రాజ్యసభ సభ్యునిగా పని చేసిన యడ్లపాటి…తాను చేపట్టిన పదవులకు వన్నె తెచ్చారని బాబు కొనియాడారు. యడ్లపాటి మృతిపై టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర సంతాపం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా గొప్ప నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకీ తీరని లోటని తెలిపారు. టీడీపీకి ఆయన ఎనలేని సేవలు చేశారని గుర్తు చేసుకున్నారు. యడ్లపాటి వెంకట్రావు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.