Tirupati Bypoll : తిరుపతి బైపోల్ వార్

తిరుపతి ఉపఎన్నికలో నకిలీ ఓట్ల వ్యవహారం రాజకీయ పార్టీల్ని కుదిపేస్తోంది. ఉపఎన్నికల పోలింగ్‌ కోసం ఇతర ప్రాంతాల నుంచి నకిలీ ఓటర్లను అధికార వైసీపీ రంగంలోకి దింపిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

Tirupati Bypoll : తిరుపతి బైపోల్ వార్

Tirupati Bypoll War

Tirupati Bypoll War : తిరుపతి ఉపఎన్నికలో నకిలీ ఓట్ల వ్యవహారం రాజకీయ పార్టీల్ని కుదిపేస్తోంది. ఉపఎన్నికల పోలింగ్‌ కోసం ఇతర ప్రాంతాల నుంచి నకిలీ ఓటర్లను అధికార వైసీపీ రంగంలోకి దింపిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పలు చోట్ల నకిలీ ఓటర్లను టీడీపీ, బీజేపీ నేతలు పట్టుకోవడం కలకలం రేపింది. దీంతో రీపోలింగ్‌కు విపక్ష టీడీపీ, బీజేపీలు డిమాండ్ చేస్తున్నాయ్‌.

తిరుపతిలో నకిలీ ఓట్లతో వైసీపీ గెలవాలని చూస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో అన్ని పార్టీలు పాల్గొన్నాయని, వైసీపీ దుర్మార్గాలను అన్ని పార్టీలు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాయని తెలిపారు చంద్రబాబు. వీరిని తాము రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని తెలిపారు టీడీపీ అధినేత. తిరుపతిలో రీపోలింగ్‌ నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

తిరుపతి ఉపఎన్నికను రద్దు చేయాలని, కేంద్ర బలగాలు మోహరించి మళ్ళీ ఎన్నికలు జరపాలని ఈసీని కోరారు టీడీపీ ఎంపీలు. వీడియో కాన్ఫ్‌రెన్స్‌ ద్వారా ఎన్నికల్‌ కమిషన్‌తో మాట్లాడిన టీడీపీ ఎంపీలు.. వీడియోలను ఆధారాలుగా అందించారు. ఎన్నికల అధికారుల ద్వారా నివేదికలు తెప్పించుకుని చర్యలు తీసుకుంటామని ఎంపీలకు ఈసీ హామీ ఇచ్చింది.

ఇప్పటికే ఓటర్ల జాబితాలో రెండు లక్షల నకిలీ పేర్లను పెట్టారంటూ వైసీపీపై ఆరోపణలు చేస్తున్నాయి విపక్షాలు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని బీజేపీ నేత శాంతారెడ్డి ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్దితి ఉందన్నారు ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డీ. పోలీసులు, వాలంటీర్లు, వైసీపీ నాయకులు కుమ్మక్కై ఎన్నికలను ప్రహసనంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ ఓట్లకు కారణమైన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విపక్షాలు చేస్తున్న విమర్శలకు దీటుగా కౌంటర్ ఇస్తుంది వైసీపీ. ప్రధానంగా టీడీపీని టార్గెట్‌ చేశారు ఆ పార్టీ నేతలు. ఓటమి భయంతోనే దొంగ ఓట్ల డ్రామా ఆడుతున్నారంటూ మండిపడ్డారు మంత్రి పెద్దారెడ్డి. చిన్న విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ ఎన్నిక రద్దుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఉప ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లు వేయిస్తోందన్న టీడీపీ ఆరోపణలపై ఫైర్ అయ్యారు మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్. చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారాయన. ఓటమిని ఒప్పుకోలేని స్థితిలో చంద్రబాబు అండ్ కో నయా డ్రామాలకు తెర లేపిందన్నారు అనిల్ కుమార్ యాదవ్.

మొత్తమ్మీద.. తిరుపతి ఉప ఎన్నికల వేళ కొందరు దొంగ ఓటర్లను విపక్షాలు బయటపెట్టడంపై పెనుదుమారమే రేగుతోంది. రీపోలింగ్‌కు విపక్షాలు డిమాండ్ చేస్తుండగా.. అధికారపక్షం మాత్రం వాళ్లు దేవాలయాలకు వెళ్లేవారని అంటోంది. దీనిపై ఎన్నికల కమిషన్‌కు విపక్షాలు కంప్లైంట్ కూడా చేశాయి. దీనిపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.