నమ్మకద్రోహం, నిందలు, వేధింపులు.. అబ్దుల్ సలాం కుటుంబాన్ని చంపేశాయి.. నంద్యాలలో గుండెలు పిండే విషాదం

  • Published By: naveen ,Published On : November 10, 2020 / 12:52 PM IST
నమ్మకద్రోహం, నిందలు, వేధింపులు.. అబ్దుల్ సలాం కుటుంబాన్ని చంపేశాయి.. నంద్యాలలో గుండెలు పిండే విషాదం

abdul salam family suicide: నమ్ముకున్న వారే నట్టేట ముంచే ప్రయత్నాలు.. వరుసగా వెంటాడుతున్న నిందలు.. చేయని తప్పును ఒప్పుకోవాలంటూ పోలీసుల వేధింపులు.. కనుచూపు మేరలో కనిపించని సాయం.. అన్నీ కలిసి ఆ కుటుంబాన్ని చావుకి దగ్గర చేశాయి. ఓ ఆటో డ్రైవర్‌తో పాటు అతడి ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశాయి. ఓ సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ వేధింపులు నాలుగు నిండు ప్రాణాల్ని బలితీసుకున్నాయి.




ఓ వైపు అవమానభారం.. మరోవైపు పోలీసుల వేధింపులు.. ఏం తప్పు చేయలేదని తన మనస్సాక్షి చెబుతోంది.. పద్దెనిమిదేళ్ల పాటు బంగారం షాపులో నమ్మకస్తుడిగా పని చేసిన పేరుంది.. ఓనర్ల మధ్య తగాదాల వల్ల వచ్చిన సమస్యతో ఓ సారి దొంగగా ముద్రపడ్డాడు.. మరోసారి అదే తరహా నింద తన మీద పడడంతో తట్టుకోలేకపోయాడు.. అన్నీ కలిసి బతుకు మీద విరక్తి వచ్చేలా చేశాయి.. చివరకు ఆత్మహత్య మార్గాన్ని ఎంచుకునేలా చేశాయి..

ఆటోలో రూ.70వేలు పోయాయని ఫిర్యాదు, నరకం చూపించిన పోలీసులు:
అబ్దుల్‌ సలాం(42)..ఓ సాధారణ ఆటో డ్రైవర్‌..పొద్దంతా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. భర్త కష్టానికి తోడుగా ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పని చేసేది భార్య నూర్జహాన్‌(36). తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి బుద్దిగా చదువుకునే ఇద్దరు పిల్లలు సల్మా(14), ఖలందర్‌లు(10). సాఫీగా సాగిపోతున్న వారి కుటుంబంలో నవంబర్‌ 1న కుదుపు మొదలైంది. సలాం ఆటోలో ప్రయాణించిన ఓ వ్యక్తి 70 వేలు పొగొట్టుకున్నాడని, స్టేషన్‌కి రావాలంటూ పిలిచారు నంద్యాల వన్‌ టౌన్‌ పోలీసులు. 70 వేలు ఏం చేశావంటూ నరకం చూపించారు. మానసికంగా, శారీరకంగా వేధించారు.

5 కేజీల బంగారం చోరీ కేసులో జైలుశిక్ష:
సరిగ్గా ఏడాది కిందట అంటే 2019 నవంబర్‌ 7న ఇదే పోలీస్‌ స్టేషన్‌లో అబ్దుల్‌ సలాంపై తొలిసారి ఓ కేసు నమోదు అయ్యింది. నంద్యాలలోని ఓ బంగారం దుకాణంలో 1992 నుంచి అబ్దుల్‌ సలాం గుమాస్తాగా పని చేశాడు. ఆ దుకాణంలో 5 కేజీల బంగారం దొంగతనం జరిగిందంటూ ఓనర్లు ఫిర్యాదు చేశారు. దీంతో వివిధ సెక్షన్ల కింద అబ్దుల్‌ సలాంపై పోలీసులు కేసు పెట్టారు. దీంతో 42 రోజుల పాటు జైలు జీవితం గడిపి బెయిల్‌ పై బయటకు వచ్చాడు.

అబ్దుల్ ని హింసించి తీవ్రంగా కొట్టిన సీఐ, హెడ్ కానిస్టేబుల్:
అప్పటి నుంచి ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. అంతకుముందు బంగారం షాపులో గుమాస్తాగా పని చేస్తున్న సమయంలో సలాం…తనకు తెలిసిన వారితో అగ్రి గోల్డ్‌ డిపాజిట్లు చేయించాడు. కంపెనీ బోర్డు తిప్పేయడంతో పరువు కాపాడుకునేందుకు తన ఆస్తి అమ్మేసి డిపాజిటర్లకు సొమ్ము చెల్లించాడు. సీన్‌కట్‌ చేస్తే..ఉన్న ఆస్తి అంతా పోవడం..పాత బంగారం కేసు..ఇప్పుడు ఆటోలో ప్రయాణించిన వ్యక్తి 70 వేల రూపాయలు పోగొట్టుకోవడం..ఈ నేపథ్యంలో సీఐతో పాటు ఓ హెడ్ కానిస్టేబుల్‌.. అబ్దుల్‌ సలాంపై తమ ప్రతాపం చూపించారు. దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలంటూ వేధించారు. చూపించుకోలేని చోట భరించలేని విధంగా చావబాదారు.
https://10tv.in/new-twist-sheikh-abdul-salam-family-suicide-case-at-nandyal/
మరోసారి దొంగతనం ఆరోపణలు రావడంతో కుంగుబాటు, చనిపోవాలని నిర్ణయం:
మాటలతో మానసికంగా వేధించారు. గతంలో ఓ సారి జైలు జీవితం అనుభవించిన అబ్దుల్‌ సలాంకి మరోసారి దొంగతనం ఆరోపణలు రావడంతో కుంగిపోయాడు. ఈ పరిస్థితుల్లో తాను బతకడం అనవసరం అనుకోవడమే కాకుండా..భార్య, ఇద్దరు బిడ్డల ప్రాణాలను సైతం తనతో తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అంతా కలసి రైలు పట్టాలను ఆశ్రయించారు. వారి మీద నుంచి గూడ్స్‌ రైలు దూసుకుపోయింది. నలుగురి ప్రాణాలూ గాలిలో కలిసిపోయాయి.

మా చావుతోనైనా మీకు మనశ్శాంతి కలుగుతుందని సెల్ఫీ వీడియో:
అయితే అంతకుముందు..తమ ఆత్మహత్యకు పోలీసులే కారణమంటూ సెల్ఫీ వీడియోలో తన గోడును వెల్లబోసుకుంది సలామ్‌ ఫ్యామిలీ. తాము ఏ తప్పు చేయలేదని..దొంగతనానికి మాకు ఎలాంటి సంబంధం లేదంటూ తీవ్ర ఆవేదన చెందారు. టార్చర్‌ భరించలేకపోతున్నానని.. తమకు సాయం చేసే వారు ఎవరూ లేరని..మా చావుతోనైనా మీకు మనశ్శాంతి కలుగుతుందని అనుకుంటున్నాను సార్..అంటూ తీవ్ర ఆవేదనతో చెప్పాడు అబ్దుల్‌ సలాం.

పోలీసులపై సీఎం జగన్ సీరియస్:
సలామ్‌ సెల్ఫీ వీడియో బయటకు రావడంతో… పోలీసులపై ప్రజాగ్రహం పెల్లుబికింది. ప్రజా సంఘాలు నంద్యాల పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులపై సీరియస్‌ అయ్యారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌.. విచారణకు ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారుల విచారణలో సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌ వేధింపులతోనే సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్టు తేలింది. దీంతో ఆ ఇద్దరిపైనా క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు ఉన్నతాధికారులు. మరోవైపు దీనిపై విచారణ జరిపేందుకు ఐ.జి శంకర్ బాత్ర బాగ్చి, ఐపీఎస్‌ అధికారి ఆరిఫ్ హఫీజ్‌లతో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

పోలీసులే అన్యాయం చేస్తే ప్రజలకు దిక్కెవరు?
వేధింపులకు గురి చేసిన ఇద్దరిపై చర్యలు తీసుకోవడంతో..సలామ్‌ కుటుంబసభ్యులు, బంధువులు కొంత ఊరట పొందారు. కానీ..ఆ ఇద్దరిని సస్పెండ్‌తోనే వదిలేయకుండా వారిపై కఠిన చర్యలు తీసుకుని..తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ప్రజలకు రక్షణ కల్పిస్తూ..కష్టాలు, సమస్యల్లో ఉన్న వారికి అండగా ఉండాల్సిన పోలీసులే…ఇలా వేధింపులకు గురిచేస్తే..ఇక ఆ ప్రజలకు దిక్కెవరు.? ఇలాంటి ఖాకీలను కఠినంగా శిక్షించాలి. మరో పోలీస్‌ ఇలాంటి పనులు చేయాలంటే భయపడేలా చర్యలు తీసుకోవాలి.