Ap Panchayat Elections: రెండు చోట్ల గెలవడం శాపంగా మారింది.. పంచాయతీ ఎన్నికల్లో అరుదైన ఘటన

పంచాయతీ ఎన్నికల్లో అరుదైన ఘటన జరిగింది. రెండు చోట్ల గెలవడం ఆయనకు శాపంగా మారింది. చివరికి ఏ పదవీ దక్కుండా అయ్యింది. గెలిచిన ఆనందాన్ని ఎంజాయ్ చేసేలోపే ఊహించని పరిణామాలు జరిగిపోయాయి. తాను చేసిన చిన్న పొరపాటుకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది.

Ap Panchayat Elections: రెండు చోట్ల గెలవడం శాపంగా మారింది.. పంచాయతీ ఎన్నికల్లో అరుదైన ఘటన

Ap Panchayat Elections

very rare event in ap panchayat elections: పంచాయతీ ఎన్నికల్లో అరుదైన ఘటన జరిగింది. రెండు చోట్ల గెలవడం ఆయనకు శాపంగా మారింది. చివరికి ఏ పదవీ దక్కుండా అయ్యింది. గెలిచిన ఆనందాన్ని ఎంజాయ్ చేసేలోపే ఊహించని పరిణామాలు జరిగిపోయాయి. తాను చేసిన చిన్న పొరపాటుకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపర్రులో ఫిబ్రవరి 9న చింతపర్రు సర్పంచ్‌ పదవితో పాటు గ్రామంలోని వార్డు పదవులకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అదే గ్రామానికి చెందిన పెనుమత్స వెంకట రామకృష్ణంరాజు 4, 5 వార్డుల్లో పోటీ చేశారు. రెండుచోట్లా ప్రత్యర్థుల్ని చిత్తు చేసి మరీ గెలిచారు. ఆ తర్వాత వార్డు సభ్యుల ద్వారా పరోక్ష పద్ధతిన జరిగే ఉప సర్పంచ్‌ ఎన్నికల్లోనూ రామకృష్ణంరాజు పోటీపడి ఉప సర్పంచ్‌గానూ గెలుపొందారు. కానీ.. చివరకు వార్డు పదవితోపాటు ఉప సర్పంచ్‌ పదవికి సైతం ఆయన దూరం కావాల్సి వచ్చింది.

ప్రత్యర్థుల ఫిర్యాదుతో..
పంచాయతీ ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒక స్థానానికి మించి పోటీ చేయకూడదు. కానీ.. రామకృష్ణంరాజు మాత్రం రెండు వార్డుల్లో పోటీ చేయడమే కాకుండా రెండుచోట్లా గెలిచారు. నిబంధనల కారణంగా.. ఆయన రెండు వార్డు పదవులతో పాటు ఉప సర్పంచ్‌ పదవిని సైతం కోల్పోవాల్సి వచ్చింది.

ఎన్నికల నిబంధనావళి రూల్‌ నంబర్‌ 8(3) ప్రకారం.. ఒక అభ్యర్థి ఒకచోట కంటే ఎక్కువ చోట్ల నామినేషన్లు దాఖలు చేసిన పక్షంలో నామినేషన్ల ఉపసంహరణ తేదీ నాటికి అందులో ఏదో ఒకచోట తప్ప మిగిలిన చోట్ల నామినేషన్లు ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్లన్నీ రద్దవుతాయి. ఈ నిబంధన విషయంలో పోటీ చేసిన అభ్యర్థితోపాటు రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించిన ఉద్యోగికి సైతం అవగాహన లేకపోవడంతో రామకృష్ణంరాజుకు రెండుచోట్లా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. దీనివల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.

రామకృష్ణంరాజు నిబంధనలను ఉల్లంఘించి ఎన్నికల్లో గెలిచారంటూ అయనపై పోటీ చేసిన ప్రత్యర్ధులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో విచారణ జరిపించిన ఎన్నికల కమిషన్‌ ఆ రెండు వార్డుల ఎన్నికలతో పాటు ఉప సర్పంచ్‌ ఎన్నికనూ రద్దు చేసింది. దీంతో ఆయన అన్ని పదవులనూ కోల్పోవాల్సి వచ్చింది. రిటర్నింగ్‌ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్ల ఈ పరిస్థితి ఎదురైనట్టు గుర్తించిన కలెక్టర్‌.. స్టేజ్-1 రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించిన కె.శ్రీరామమూర్తిని సస్పెండ్‌ చేసినట్టు సమాచారం.

ఆ రెండు వార్డుల ఎన్నికకు ప్రత్యేక నోటిఫికేషన్‌
చింతపర్రు గ్రామ పంచాయతీలో 4, 5 రెండు వార్డులతోపాటు ఉప సర్పంచ్‌ పదవికి తిరిగి ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మార్చి 13న నోటిఫికేషన్‌ జారీ చేసింది. రెండు వార్డు పదవులకు బుధవారం(మార్చి 17,2021) సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. మార్చి 26న పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు ఉప సర్పంచ్‌ ఎన్నికను కూడా చేపడతారు. ఇలావుండగా, రామకృష్ణంరాజు రెండు వార్డుల్లోనూ తిరిగి నామినేషన్‌ వేశారు. ఏ వార్డు అనుకూలమో నిర్ణయించుకుని రెండోచోట నామినేషన్‌ ఉపసంహరించుకుంటానని ఆయన తెలిపారు. మరి ఈసారైనా ఆయన కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.