గుట్టు తేలేనా..? ఇంద్రకీలాద్రిలో ఏం జరుగుతోంది..?

గుట్టు తేలేనా..? ఇంద్రకీలాద్రిలో ఏం జరుగుతోంది..?

ఇంద్రకీలాద్రిపై ఏం జరుగుతోంది..? గతంలో ఎన్నడూ లేని విధంగా ఏసీబీ సోదాలు సుదీర్ఘంగా సాగుతున్నాయి. మూడు రోజులుగా ఇంద్రకీలాద్రిపై ఏసీబీ సోదాలు జరుగుతుండగా.. మూడో రోజు ఇంజనీరింగ్ విభాగంలో అధికారులు తనిఖీలు చేశారు. ఇప్పటివరకు నిర్వహించిన టెండర్లపై ఆరా తీయగా.. పెండింగ్ పనులు ఎంత వరకు పూర్తయ్యాయి. ఎన్ని పనులు జరిగాయనే విషయంపై రికార్డులను పరిశీలించారు. ఆ పనులకు జరిపిన చెల్లింపులు, పెండింగ్ బిల్లులుపై ఆరా తీశారు.

ఇప్పటివరకు విజిలెన్స్‌, ఏసీబీ సోదాలు నిర్వహించినా.. ఇంత సుదీర్ఘంగా ఎన్నడూ జరగలేదని చెబుతున్నాయి దుర్గగుడి వర్గాలు. పక్కా సమాచారంతోనే రంగంలోకి ఏసీబీ అధికారులు దిగారని తెలుస్తోంది. గురువారం ప్రారంభమైన సోదాలు మూడు రోజులు కొనసాగాయి. స్క్రాప్ అమ్మకాలపై ఏసీబీ అధికారులు ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. రెండు కోట్ల రూపాయల విలువ చేసే స్క్రాప్‌ను కేవలం 40 లక్షలకే అమ్మినట్లుగా అధికారులు గుర్తించారు. శానిటేషన్‌, సెక్యూరిటీ సిబ్బంది టెండర్ల విషయంలో భారీగా అక్రమాలు జరిగినట్లు తేల్చాయి ఏసీబీ టీమ్స్‌.

ప్రొవిజన్స్‌ స్టోర్‌, కేశఖండన, ప్రసాదం, సాధారణ పరిపాలన, చీరల విభాగంలో భారీగా అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి. సుదీర్ఘ సోదాలు నిర్వహించిన ఏసీబీ.. టికెట్‌, చీరల కౌంటర్‌, నిత్య అన్నదానం విభాగాల్లో కీలక ఆధారాలు సేకరించింది. ఈవోగా కోటేశ్వరమ్మ బాధ్యతలు స్వీకరించాక.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కీలక స్థానాల నుంచి తప్పించారు. అయితగే అంతర్గత బదిలీల విషయంలో కూడా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు.