ప్రజల భూములకు ప్రభుత్వ రక్షణ : భూ హక్కు, భూ రక్ష సర్వే..ఎలా జరుగుతుంది – సీఎం జగన్

ప్రజల భూములకు ప్రభుత్వ రక్షణ : భూ హక్కు, భూ రక్ష సర్వే..ఎలా జరుగుతుంది – సీఎం జగన్

YSR Jagananna Saswatha Bhoomi Hakku-Bhoomi Rakshana : ప్రజల భూములకు ప్రభుత్వ రక్షణగా ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు. ఒకవేళ తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినట్టు తేలితే, బాధితుడికి ప్రభుత్వమే నష్ట పరిహారం అందిస్తుందన్నారు. అవినీతి తావు లేకుండా…భూముల లావాదేవీలన్నీ..ఇకపై గ్రామాల్లోనే జరుగబోతున్నాయని ప్రకటించారాయన. 2020, డిసెంబర్ 21వ తేదీ సోమవారం వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని ఆయన ప్రారంభించారు. తక్కెళ్లపాడులో సరిహద్దు రాయి పాతి భూ సర్వేకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సర్వేకు సంబంధించిన వివరాలు తెలియచేశారు.

‘గ్రామ సభలు, సర్వే విధానం, షెడ్యూల్ కలిగే ప్రయోజానాలు వార్డు పరిధిలో వివరిస్తారు. గ్రామ, వార్డు, సచివాలయ కార్యదర్శి బృందాలు సర్వే నిర్వహిస్తారు. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా దీనిని చేపడుతారు. ప్రతి యజమానికి డిజిటల్ రికార్డులు 9.2 నోటీసు ద్వారా తెలియచేస్తారు. వివరాల మీద అభ్యంతరాలు ఉంటే..తమ గ్రామ సచివాలయాల్లో అప్పీల్ చేసుకోవాలి. పరిష్కారం కోసం మెజిస్ట్రేట్ బృందం ఏర్పాటు చేస్తాం. యజమానులకు శాశ్వత ఆస్తి హక్కు పత్రం అందచేస్తాం. ప్రతి భూమికి ఒక ఐడీ నెంబర్ కేటాయిస్తాం. డిజిటల్ రికార్డ్స్, హార్డ్ కాపీ కూడా భూ యజమానికి కూడా ఇస్తాం. ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాలు ఆయా గ్రామ సచివాలయాల్లో జరిగే పరిస్థితి ఏర్పడుతుంది.

ల్యాండ్ టైటిల్ యాక్టు తీసుకొచ్చాం. భూముల మీద ఊహజనితమైన హక్కులున్నాయి. పూర్తి హక్కులు లేవు. ఈ కార్యక్రమం ద్వారా ఆ హక్కులు కలుగుతాయి. పారదర్శకంగా..వివాదాలకు, అవినీతి తావు లేకుండా..గ్రామంలోనే..ఇక మీదట భూ లావాదేవీలు జరుగుతాయి. అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులను సక్రమంగా..తీర్చిదిద్దుతారు. వాస్తవంగా రికార్డులు తయారవుతాయి. ప్రతి సర్వే నెంబర్ కు ప్రభుత్వ ముద్ర ఉన్న హద్దు రాళ్లను ఏర్పాటు చేస్తాం. దీనివల్ల సరిహద్దు వివాదాలకు తెరపడుతుంది. సబ్ డివిజన్ సమస్యలు తొలగిపోతాయి, స్థిరాస్థికి సంబంధించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నాం’. అని సీఎం జగన్ తెలిపారు.