సమగ్ర భూ సర్వేతో వివాదాలకు చెక్, వివరాలు చెప్పిన సీఎం జగన్

సమగ్ర భూ సర్వేతో వివాదాలకు చెక్, వివరాలు చెప్పిన సీఎం జగన్

YSR Jagananna Saswatha Bhoomi Hakku-Bhoomi Rakshana : ఏపీలో సమగ్ర భూ సర్వే ప్రారంభమైంది. వైఎస్సార్ జగనన్న శాశ్వాత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. 2020, డిసెంబర్ 21వ తేదీ సోమవారం తక్కెళ్లపాడులో సరిహద్దు రాయి పాతి భూ సర్వేకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. అత్యాధునికంగా ఈ సర్వే నిర్వహించడం జరుగుతోందని, 16 వేల మంది సర్వేయర్లు నియమించినట్లు చెప్పారు. సర్వేయర్లందరికీ అత్యాధునిక టెక్నాలజీతో శిక్షణనిస్తున్నామని, సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ శిక్షణ జరుగుతోందన్నారు. సమగ్ర భూ సర్వేతో వివాదాలకు చెక్ పడుతుందని చెప్పిన సీఎం జగన్..దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

‘ప్రభుత్వ హామీతో కూడిన..శాశ్వత భూ ఆస్తి పత్రం ఆ భూ యజమానికి ఇస్తాం. అంగుళాలతో సహా..నిర్ధారించిన..భూమి సరిహద్దులు, సర్వే వివరాలతో కూడిన మ్యాప్ ఇస్తాం. ప్రతి రెవెన్యూ విలేజ్..ఒక మ్యాప్ ఉంటుంది. ప్రతొక్కరి భూమికి ఆధార్ నెంబర్ మాదిరిగా..ప్రత్యేకమైన ఒక నెంబర్ (యునిక్ కోడ్) కేటాయిస్తాం. ఒక నెంబర్‌తో భూమి నిర్ధారణ అవుతుంది. వార్డులు, గ్రామ సచివాలయాల్లో..దీనికి సంబంధించిన వివరాలు డిస్ ప్లే చేస్తారు. ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే..శాశ్వత టైటిల్ అప్పుడు ఇస్తారు. అన్ని డిపార్ట్ మెంట్‌లు ఒకే చోట ఉండేలా..రిజిస్ట్రేషన్‌లు ఆ గ్రామంలో జరిగేలా చూస్తాం.

వివాదాలకు తావు ఉండదు..తక్కెళ్లపాడులో భూముల సర్వే పూర్తి చేసి..రాష్ట్రమంతా ఆదర్శంగా ఈ గ్రామం నిలుస్తుంది. మూడు దశల్లో పూర్తి అవుతుంది. ఒక్క పైసా కూడా..రైతు, భూ యజమాని ఖర్చు పడకుండా..ప్రభుత్వమే భరిస్తుందన్నారు. సరిహద్దు రాళ్ల ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, ఇతర డిపార్ట్ మెంట్‌లు సంయుక్త భాగస్వామ్యంలో వేయి కోట్ల బడ్జెట్‌తో కార్యక్రమం చేపడుతున్నామన్నారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో రిజిస్ట్రేషన్ అందుబాటులోకి తెస్తాం. 2023 నాటికి పూర్తిగా సర్వే నిర్వహిస్తామన్నారు’. అన్నారు సీఎం జగన్.