గుడ్ న్యూస్ వినిపించిన మోడర్నా.. టీకా పని చేస్తోంది, కరోనా నుంచి కాపాడుతుంది

  • Published By: naveen ,Published On : July 29, 2020 / 11:36 AM IST
గుడ్ న్యూస్ వినిపించిన మోడర్నా.. టీకా పని చేస్తోంది, కరోనా నుంచి కాపాడుతుంది

కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న సంస్థల్లో అమెరికాలోని బయోటెక్ కంపెనీ మోడర్నా ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి ఈ సంస్థకు అమెరికా ప్రభుత్వమే నిధులు సమకూర్చింది. ఇక ఈ సంస్థ తమ లాస్ట్ స్టేజ్ ట్రయల్స్‌ను సోమవారం(జూలై 27,2020) ప్రారంభించింది. ఈ ట్రయల్‌లో కొవిడ్-19 వల్ల తలెత్తే శ్వాసకోశ సమస్యలు లేని దాదాపు 30 వేల మంది యుక్త వయసున్న వాలంటీర్లు పాల్గొన్నారు.



మోడర్నా సంస్థ, అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ షాట్స్‌‌ను ఈ వాలంటీర్లపై ప్రయోగించనున్నారు. రెండు డోసులు ఇచ్చిన తర్వాత ఎవరిలో ఏ విధంగా ఈ షాట్స్ ప్రభావం చూపిస్తున్నాయన్న దానిపై శాస్త్రవేత్తలు పరీక్షిస్తారు. కాగా.. చైనా, బ్రిటన్‌లో కూడా లాస్ట్ స్టేజ్ ట్రయల్స్‌ జరుగుతున్నప్పటికి అక్కడ చాలా తక్కువ మంది వాలంటీర్లపైనే ప్రయోగాలు నిర్వహిస్తున్నారు.

ఇన్ఫెక్షన్ నుంచి ఊపిరితిత్తులు, ముక్కుని కాపాడిన వ్యాక్సిన్:
ఇది ఇలా ఉండగా, మోడర్నా గుడ్ న్యూస్ వినిపించింది. తాము అభివృద్ధి చేసిన టీకా(వ్యాక్సిన్) బాగానే పని చేస్తోందని, రోగనిరోధక శక్తిని పెంచిందని, కరోనా బారి నుంచి ఊపిరితిత్తులను కాపాడుతుందని చెప్పింది. కోతుల్లో చేసిన ప్రయోగాల్లో ఈ విషయం రుజువైందన్నారు. MRNA-1273 వ్యాక్సిన్ ను జంతువుల్లో ప్రయోగించాము. ఆ వ్యాక్సిన్, వైరస్ సంక్రమణ నుంచి ఊపిరితిత్తులు, ముక్కుని కాపాడింది. పల్మినరీ వ్యాధులను నిరోధించింది. అన్ని జంతువుల్లోనూ ఇదే జరిగింది. కోతుల్లో జరిపిన పరిశోధనల తాలూకు ఫలితాలను న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో పబ్లిష్ చేసినట్టు మోడర్నా ప్రతినిధులు తెలిపారు. అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ చూపిన ఫలితాల కన్నా మోడర్నా వ్యాక్సిన్ ఇంకొంత ఎక్కువగా ఫలితం చూపినట్టు వారు చెప్పారు.


వైరల్ రెప్లికేషన్, ఊపిరితిత్తుల వాపు నుంచి రక్షణ:
24 కోతులపై పరిశోధకులు అధ్యయనం చేశారు. వాటికి 100 మెక్రోగ్రాముల వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. రెండు డోసులు.. ఊపిరితిత్తుల్లో వైరల్ రెప్లికేషన్ మరియు ఊపిరితిత్తుల వాపు నుండి రక్షించడంలో సమర్థవంతంగా నిరూపించబడ్డాయి. పెద్ద డోసు, జంతువుల ముక్కులో వైరల్ రెప్లికేషన్ నుండి కూడా రక్షించింది. అస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ సైతం దాదాపుగా ఇలాంటి ఫలితమే చూపింది. వైరస్ బారి నుంచి ఊపిరితిత్తులను కాపాడింది. అలాగే వైరల్ రెప్లికేషన్ ను అడ్డుకుంది. ఊపిరితిత్తుల్లో వైరస్ రెప్లికేషన్ ను అడ్డుకున్నా ముక్కులో మాత్రం నివారించలేకపోయింది.

నమ్మకాలు పెరిగాయి, షేర్ ధరా పెరిగింది:
ఈ ఫలితాలు మోడర్నా తయారు చేసిన వ్యాక్సిన్ పై నమ్మకాలను మరింత పెంచాయి. కాగా, మోడర్నా ఇప్పటికే మనుషులపై ప్రయోగాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మోడర్నా సంస్థ మాత్రం ఒకేసారి దాదాపు 30 వేల మందిపై అధ్యయనం చేస్తోంది. కేవలం తామిచ్చిన షాట్స్ పనిచేస్తున్నాయా లేదా అనేది మాత్రమే కాకుండా ఈ అధ్యయనం ద్వారా వ్యాక్సిన్ ఎంత వరకు సురక్షితం అనేది కూడా పరీక్షిస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక మోడర్నా 30 వేల మందితో లాస్ట్ స్టేజ్ ట్రయల్స్‌ను ప్రారంభిస్తోందనే వార్త వైరల్ అవ్వడంతో.. మోడర్నా షేర్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ సంస్థ షేర్లు 11 శాతం పెరిగి ప్రస్తుతం షేర్ ధర 81.31 డాలర్లకు చేరింది.