Top 10 Demolished Buildings: ప్రపంచవ్యాప్తంగా నేలమట్టమైన అతిపెద్ద 10 భవనాలు ఏవో తెలుసా?

మన దేశంలోని నోయిడాలో కూల్చుతున్న సూపర్‭టెక్ ట్విన్ టవర్ ఈ లిస్టులో 50వ స్థానంలో ఉంది. 103 మీటర్ల ఎత్తు, 32 అంతస్తులతో చేపట్టిన ఈ భవన నిర్మాణ పనులను 2009లో నిలిపివేశారు. నిర్మాణ సమయంలో జాతీయ బిల్డింగ్ కోడ్ నియమాలను పాటించని కారణంగా ఈ నెల 28న ఈ భవనాన్ని కూల్చివేస్తున్నారు.

Top 10 Demolished Buildings: ప్రపంచవ్యాప్తంగా నేలమట్టమైన అతిపెద్ద 10 భవనాలు ఏవో తెలుసా?

Top 10 Demolished Buildings: నోయిడాలో 40 అంతస్తుల సూపర్‭టెక్ ట్విన్ టవర్‭ని కూల్చివేసేందుకు ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సూపర్‌టెక్ ట్విన్ టవర్స్‌ను కూల్చివేసేందుకు ముహుర్తం ఖరారు చేసింది సుప్రీంకోర్టు. ఈ కూల్చివేత ప్రక్రియను కేవలం 9 నుంచి 10 సెకన్లలోనే పూర్తి చేయనుంది ఎడిపైస్ ఇంజనీరింగ్ సంస్థ. ఈ కూల్చివేత ప్రక్రియకు 3,500 కిలోల పేలుడు పదార్థాన్ని ఉపయోగించనున్నారు. సమీపంలోని భవనాలకు ఎలాంటి నష్టం జరక్కుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా, అపెక్స్ భవనం కూల్చివేతతో ప్రపంచ వ్యాప్తంగా ఇలా నేలమట్టమైన భారీ భవనాలపై కొంత మందికి ఆలోచన మొదలైంది. కారణాలు ఏవైనప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఇలా కూల్చివేసిన భవనాలు చాలానే ఉన్నాయి. కూల్చివేతకు గురైన అతిపెద్ద భవంతులు ఇవేనంటూ ఎవరికి తెలిసిన సంగతులు వారు షేర్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా నేలమట్టమైన అత్యంత ఎత్తైన 10 భవనాలపై ఓ లుక్కేద్దాం.

1. ఆక్సా టవర్, సింగపూర్
Top 10 Demolished Buildings In The World

234.7 మీటర్ల ఎత్తు, 52 అంతస్తులతో ఈ భవన నిర్మాణం 1986లో పూర్తైంది. అయితే టవర్స్ సైట్ అభివృద్ధి కోసం ఈ భవనాన్ని కూల్చివేస్తున్నారట. అయితే ఈ కూల్చివేత ఇంకా పూర్తి కాలేదు. ఈ యేడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది ప్రారంభానికి కాని కూల్చాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటి వరకు కూల్చిన, కూల్చబోయే భవనాల్లో ఇదే అత్యంత ఎత్తైనది.

2. 270 పార్క్ అవెన్యూ, న్యూయార్క్.
Top 10 Demolished Buildings In The World

215 మీటర్ల ఎత్తు, 52 అంతస్తులతో చేపట్టిన ఈ భవన నిర్మాణం 1960లో పూర్తైంది. అయితే దీని సమీపంలో మరిన్ని పెద్ద భవంతుల నిర్మాణం దృష్ట్యా 2021లో కూల్చివేశారు. ఇప్పటికే కూల్చివేసిన భవంతుల్లో ఇది అతిపెద్దది. మొత్తంగా రెండవది.

3. సింగర్ బిల్డింగ్, న్యూయార్క్.

187 మీటర్ల ఎత్తు, 47 అంతస్తులతో చేపట్టిన ఈ భవన నిర్మాణం 1908లో పూర్తైంది. వన్ లిబర్టీ ప్లాజాకు దారి కోసం ఈ భవనాన్ని 1968లో కూల్చేశారు.

4. సీపీఎఫ్ బిల్డింగ్, సింగపూర్.

171 మీటర్ల ఎత్తు, 46 అంతస్తులతో చేపట్టిన ఈ భవన నిర్మాణం 1976లో పూర్తైంది. 29 అంతస్తుల ఆఫీసు టవర్‭కు దారి ఇవ్వడం కోసం 2017లో కూల్చేశారు.

5. మీనా ప్లాజా, అబు దాబి.

168.5 మీటర్ల ఎత్తు, 46 అంతస్తులతో ఈ భవన నిర్మాణం చేపట్టారు. అయితే నిర్మాణం పూర్తి కాకుండానే 2014లో పనులు నిలిపివేశారు. కారణాలు పూర్తిగా తెలియవు కానీ, 2020లో పేలుడు పదార్థాలు ఉపయోగించి కూల్చి వేశారు.

6. ఫుజి జిరాక్స్ టవర్స్, సింగపూర్.

165 మీటర్ల ఎత్తు, 38 అంతస్తులతో చేపట్టిన ఈ భవన నిర్మాణం 1987లో పూర్తైంది. దీని సమీపంలో అభివృద్ధి దృష్ట్యా కూల్చేయాలని నిర్ణయించారు. ఈ యేడాదే కూల్చేసే పనిలో ఉన్నారు.

7. మారిసన్ హోటల్, చికాగో.

160 మీటర్ల ఎత్తు, 45 అంతస్తులతో చేపట్టిన ఈ భవన నిర్మాణం 1925లో పూర్తైంది. బ్యాంక్ వన్ ప్లాజాకు దారి కోసం 1965లో కూల్చేశారు.

8. డ్యూశ్చే బ్యాంక్ బిల్డింగ్, న్యూయార్క్.

158 మీటర్ల ఎత్తు, 39 అంతస్తులతో చేపట్టిన ఈ భవన నిర్మాణం 1974లో పూర్తైంది. సెప్టెంబర్ 11 దాడుల అనంతరం బాగా డ్యామేజ్ అయిందని 2011లో కూల్చివేశారు.

9. యూఐసీ బిల్డింగ్, సింగపూర్.

152 మీటర్ల ఎత్తు, 40 అంతస్తులతో చేపట్టిన ఈ భవన నిర్మాణం 1974లో పూర్తైంది. వీ యాన్ శెంటన్‭కు దారి కోసం 2013లో కూల్చివేశారు.

10. వన్ మెరిడియన్ ప్లాజా, ఫిలడెల్ఫియా.

150 మీటర్ల ఎత్తు, 38 అంతస్తులతో చేపట్టిన ఈ భవన నిర్మాణం 1972లో పూర్తైంది. ఫిబ్రవరి 23, 1991లో జరిగిన అగ్నిప్రమాదంలో చాలా వరకు డ్యామేజ్ అయింది. దీంతో 1999లో కూల్చివేశారు.

ఇక తాజాగా మన దేశంలోని నోయిడాలో కూల్చుతున్న సూపర్‭టెక్ ట్విన్ టవర్ ఈ లిస్టులో 50వ స్థానంలో ఉంది. 103 మీటర్ల ఎత్తు, 32 అంతస్తులతో చేపట్టిన ఈ భవన నిర్మాణ పనులను 2009లో నిలిపివేశారు. నిర్మాణ సమయంలో జాతీయ బిల్డింగ్ కోడ్ నియమాళను పాటించని కారణంగా ఈ నెల 28న ఈ భవనాన్ని కూల్చివేస్తున్నారు.