కాశ్మీర్‌లో బీజేపీ నేత, కుటుంబ సభ్యులను కాల్చి చంపిన ఉగ్రవాదులు, దాడి సమయంలో కనిపించని సెక్యూరిటీ సిబ్బంది

  • Published By: venkaiahnaidu ,Published On : July 9, 2020 / 02:39 PM IST
కాశ్మీర్‌లో బీజేపీ నేత, కుటుంబ సభ్యులను కాల్చి చంపిన ఉగ్రవాదులు, దాడి సమయంలో కనిపించని సెక్యూరిటీ సిబ్బంది

కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బండిపోరా జిల్లాలో బీజేపీ లీడర్ కుటుంబంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో స్థానిక బీజేపీ నాయకుడు షేక్ వసీమ్ బారీతో పాటు ఆయన తండ్రి, సోదరుడు మరణించారు. బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్‌కు 10 మీటర్ల దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ వసీమ్ , ఆయన తండ్రి బషీర్ అహ్మద్, సోదరుడు ఉమర్ బషీర్ బుధవారం రాత్రి తమ దుకాణంలో కూర్చొని ఉన్న సమయంలో బైక్‌పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో వసీమ్ తో సహా అయన కుటుంభ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించిగా చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఐతే షేక్ వసీమ్‌కు 10 మంది భద్రతా సిబ్బంది ఉండగా.. కాల్పుల సమయంలో ఒక్కరు కూడా ఆయనతో లేకపోవడం అనుమానాలను తావిస్తోంది. ఆ క్రమంలోనే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మొత్తం 10 మంది భద్రతా సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

షేక్ వసీమ్ గతంలో బండిపోరా జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. కాగా, ఈ ఘటనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఖండించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా. కాంగ్రెస్, పీడీపీ నేతలు సైతం వసీమ్ ఫ్యామిలీ హత్యను ఖండించారు. వారి త్యాగం వృధాగా పోదని బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు.

ఈ ఎటాక్ వెనుక పాకిస్తాన్ కు చెందిన ఉగ్ర సంస్థ జైషే మొహమ్మద్ హస్తం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పిలిచే ఒక కొత్త టెర్రర్ గ్రూప్ ఈ దాడికి బాధ్యత వహించింది. అయితే ఇది జైషే మొహమ్మద్, లష్కర్-ఏ-తోయిబా మరియు హిజ్బుల్ ముజాహిదీన్ల ఫ్రంట్ అని పోలీసులు చెబుతున్నారు. బీజేపీ నేతను చంపి పారిపోయిన ఉగ్రవాదులను గుర్తించామని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని జమ్మూకాశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు.